అక్షరటుడే, హైదరాబాద్:CM visit Davos | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) నిర్దేశిత లక్ష్యాలు, దార్శనికతను ప్రపంచానికి చాటడంలో ప్రతినిధి బృందం సఫలీకృతమైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.
CM visit Davos | వరల్డ్ ఎకనమిక్ ఫోరం..
మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ప్రతినిధి బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. అలాగే ప్రభుత్వం ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు (MoUలు) కుదుర్చుకుంది.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలక సెషన్లలో పాల్గొన్నారు. దావోస్ 2026 సదస్సు అనంతరం ఫాలోఅప్‌గా జులై – ఆగస్టు నెలల్లో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి సదస్సులో చేసిన ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించింది.
ఈ మూడు రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పలు కీలక సమావేశాలు, ప్రత్యేక సెషన్ల అనంతరం మూడు రోజుల తెలంగాణ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన గురువారం సాయంత్రంతో ముగిసింది.
దావోస్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి జూరిచ్ బయల్దేరారు. అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్తారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి దావోస్ నుంచి భారత్‌కు తిరుగు పయనమయ్యారు.