అక్షరటుడే, వెబ్డెస్క్ : Medaram Jathara | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) నేడు మేడారంలో పర్యటించనున్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
రేవంత్రెడ్డి ఆదివారం పాలేరులో పర్యటిస్తారు. అనంతరం మేడారం (Medaram Jathara) వెళ్తారు. అక్కడ కేబినెట్ మీటింగ్లో పాల్గొంటారు. ఈ క్రమంలో వరంగల్ నుంచి వెళ్ళే వారికి ములుగు, పస్రానార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారానికి అనుమతించనున్నారు. తాడ్వాయి మీదుగా వాహనాలకు ప్రవేశం లేదని పోలీసులు తెలిపారు. బయ్యక్కపేట, భూపాలపల్లి, పరకాల, గుడెప్పాడ్ మీదుగా వరంగల్ వైపు తిరుగు ప్రయాణం చేయాలి.
Medaram Jathara | తొలిసారి..
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి మంత్రివర్గ సమావేశాన్ని హైదరాబాద్ (Hyderabad) బయట నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మేడారంలో కేబినెట్ భేటీ జరగనుంది. హరిత హోటల్లో జరిగే ఈ సమావేశం ఏర్పాట్లను ఆదివారం ఉదయం మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ మీటింగ్లో మున్సిపల్ ఎన్నికలు, రైతు భరోసా, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తదితర అంశాలపై చర్చించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మేడారంలో రూ.260 కోట్ల శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టింది. సమ్మక్క–సారలమ్మ గద్దెలను పునర్నిర్మించింది. కేబినెట్ భేటీ అనంతరం సీఎం రాత్రి మేడారంలోనే బస చేయనున్నారు. సోమవారం ఉదయం గద్దెలను ఆయన ప్రారంభిస్తారు.