అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ (Davos)కు బయలుదేరారు. అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొంటారు.
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF26) వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లింది. సోమవారం ఉదయం సీఎం మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి, ప్రారంభించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. దావోస్ పర్యటనలో మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy), ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఉంటారు.
CM Revanth Reddy | నాలుగు రోజుల పర్యటన
దావోస్‌లో జనవరి 20 నుంచి నాలుగు రోజుల WEF సదస్సులో సీఎం పాల్గొంటారు. ప్రముఖ కంపెనీల సీఈవోలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తారు. గూగుల్, సేల్స్‌ఫోర్స్, యునిలీవర్, హనీవెల్, లోరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ ప్రపంచ కార్పొరేషన్ల అధిపతులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. పలు రౌండ్‌టేబుల్ చర్చల్లో కూడా పాల్గొంటారు.
CM Revanth Reddy | పెట్టుబడుల కోసం..
తెలంగాణ (Telangana)లో పెట్టుబడులు, పారిశ్రామిక విస్తరణ లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ముఖ్యంగా ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), లైఫ్ సైన్సెస్, ఉత్పాదక రంగాలపై ప్రాధాన్యత ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. దావోస్‌లో ప్రపంచ వేదికపై రాష్ట్ర బలమైన వృద్ధి సామర్థ్యాన్ని, అన్ని రంగాలలో అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను హైలైట్ చేస్తూ, “తెలంగాణ రైజింగ్ 2047” విజన్‌ను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దావోస్ పర్యటన అనంతరం సీఎం అమెరికా వెళ్తారు. తిరిగి ఆయన ఫిబ్రవరి 1న హైదరాబాద్ చేరుకుంటారు.