అక్షరటుడే, వెబ్‌డెస్క్: WEF 2026 | ప్రతి సంవత్సరం జూలైలో హైదరాబాద్‌లో వార్షిక WEF ఫాలో-అప్ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతిపాదించారు. గత నెలలో గ్లోబల్ సమ్మిట్‌లో భారీ పెట్టుబడులను ఆకర్షించిన తర్వాత, తెలంగాణకు WEF 2026 అంటే తమ దార్శనికత మరియు విధానాలను ప్రదర్శించడమే అని సీఎం అన్నారు.
దావోస్‌లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ (Join the Rise) కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆధునిక వ్యాపార చక్రాలలో ఫాలో-అప్‌లు, పెట్టుబడి నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా సుదీర్ఘ సమయం అని పేర్కొంటూ, ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో మరో ఫాలో-అప్ ఫోరమ్‌ను నిర్వహించాలని ప్రతిపాదించారు.
WEF 2026 | గ్లోబల్ సమ్మిట్ సక్సెస్
తెలంగాణలో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ (Global Summit) విజయవంతమైందని, రూ. 5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని ఆయన అన్నారు. సాధారణంగా తాము అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడానికి దావోస్‌కు వస్తామన్నారు. కానీ ఈసారి దార్శనికత, విధానాలను ప్రదర్శించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (Telangana AI Innovation Hub), తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రారంభించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రంలోని రోడ్లు, మెట్రో రైలు విస్తరణ, నదులు, సరస్సులు, జలవనరుల పునరుజ్జీవనం గురించి వివరించింది. కాగా ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి సైతం పాల్గొన్నారు.
WEF 2026 | కొత్త నగరం నిర్మిస్తున్నాం
హైదరాబాద్ (Hyderabad) గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (GCC) ప్రపంచ కేంద్రంగా ఎదిగిందని సీఎం అన్నారు. మూసీ నదికి ఇరువైపులా రాత్రిపూట ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించి, హైదరాబాద్‌ను 24 గంటలూ పనిచేసే మొదటి నగరంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కొత్త నగరం ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇది పూర్తిగా స్మార్ట్‌గా, భవిష్యత్తు కోసం రూపొందించినట్లు తెలిపారు. 30 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో, 50 శాతానికి పైగా ప్రాంతం పచ్చదనంతో కూడిన ఖాళీ స్థలంతో ఈ నగరం ఉంటుందన్నారు.