అక్షరటుడే, వెబ్‌డెస్క్: clean-shave : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వింత ఘటన వెలుగు చూసింది. గడ్డంతో ఉండే భర్త నచ్చలేదని క్లీన్ షేవ్‌తో ఉన్న మరిదితో ఓ భార్య పారిపోయింది. మేరఠ్‌లోని లిసాడి గేట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భార్య చేష్టతో కలత చెందిన భర్త.. పోలీసుల సాయం కోరాడు.
మేరఠ్‌లోని లిసాది గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉజ్వల్ గార్డెన్ ప్రాంతంలో షకీర్ అనే వ్యక్తి తల్లి, సోదరుడితో కలిసి ఉంటున్నాడు. ఏడు నెలల క్రితం ఇంచౌలి గ్రామానికి చెందిన అర్షి అనే యువతితో షకీర్‌కు పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక తొలి రాత్రి నాడు తన భర్త ఎదుట అర్షి ఒక ప్రతిపాదన ఉంచింది. గడ్డం తీసేసి క్లీన్ షేవ్ చేసుకోమని భర్తను కోరింది.
కానీ, గడ్డం తీసుకునేందుకు షకీర్ నో చెప్పాడు. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మొదటి నుంచే తాను గడ్డం పెంచుకుంటున్నాని స్పష్టం చేశాడు. గడ్డం తీయలేనని అర్షికి షకీర్ తేల్చి చెప్పేశాడు. కాగా, ఇదే విషయమై చాలాసార్లు భర్తతో భార్య గొడవకు దిగింది.
ఇదిలా ఉండగా.. షకీర్ ప్రతిరోజు ఉదయమే పనికి వెళ్లేవాడు. దీంతో ఇంట్లో షకీర్ తల్లి, సోదరుడు మాత్రమే ఉండేవారు. షకీర్ సోదరుడు క్లీన్ షేవ్ చేసుకుంటాడు. ఈ క్రమంలోనే షకీర్ ఇంట్లో లేని సమయంలో సదరు సోదరుడికి అర్షి చేరువైంది. అదును చూసి ఇద్దరు పారిపోయారు. కేవలం క్లీన్ షేవ్ కోసమే భార్య తనను వదిలేసి, సోదరుడితో వెళ్లిపోయిందని షకీర్ వాపోతున్నాడు. ఈ మేరకు పోలీసులు ఇరువురి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.