అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mana Shankaravaraprasad Garu | మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) డ్యాన్స్ అంటేనే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఆయన స్టెప్స్‌కు థియేటర్లలో వచ్చే విజిల్స్, చప్పట్లు వేరే లెవల్‌లో ఉంటాయి. తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో కూడా అదే మ్యాజిక్ మరోసారి రిపీట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలోని హుక్ స్టెప్ సాంగ్ థియేటర్లను షేక్ చేస్తోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో (Director Anil Ravipudi) తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా, వెంకటేశ్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు చిరు డ్యాన్స్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో హిట్ అయిన హుక్ స్టెప్ వెనుక ఉన్న కథను కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తాజాగా వెల్లడించారు.
Mana Shankaravaraprasad Garu | రోజువారీ టెన్షన్ నుంచే పుట్టిన స్టెప్
సినిమా చూసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆట సందీప్ (Aata Sandeep) ఈ స్టెప్ ఎలా రూపుదిద్దుకుందో చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక టెన్షన్ ఉంటుందని, తన విషయంలో అది నెలనెలా కట్టాల్సిన ఈఎంఐలేనని తెలిపారు. ఆ పాటకు స్టెప్స్ కంపోజ్ చేస్తున్న సమయంలో వరుసగా ఫోన్లు రావడంతో తీవ్ర అసహనం కలిగిందన్నారు. సాధారణంగా కంపోజింగ్ సమయంలో మొబైల్ దూరంగా పెట్టే అలవాటు తనకు ఉందని, కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ రావొచ్చన్న కారణంతో ఫోన్ తీసుకెళ్లాల్సి వచ్చిందన్నారు. లోపలికి వెళ్లాక కూడా ఫోన్లు మోగుతూనే ఉండడంతో ఒక్కసారిగా కోపం వచ్చిందని చెప్పారు.
ఆ క్షణంలో ఫోన్ పగలకొట్టాలన్నంత కోపం వచ్చినా, అదే సమయంలో చేతిలో ఉన్న సెల్‌ఫోన్ నుంచే ఒక కొత్త ఆలోచన పుట్టిందన్నారు. వెంటనే గదిలో లైట్స్ ఆఫ్ చేసి, కేవలం సెల్ ఫోన్ లైట్ వేసుకుని స్టెప్ కంపోజ్ చేయడం ప్రారంభించానని తెలిపారు. ఆ స్టెప్ చూసి తన భార్య కూడా చప్పట్లు కొట్టడంతో, ఆ ఐడియాను మరింత మెరుగుపరిచి ఫైనల్ వెర్షన్‌గా తీసుకొచ్చానని చెప్పారు. చిరంజీవి స్టైల్, గ్రేస్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ హుక్ స్టెప్‌ను డిజైన్ చేశానని ఆట సందీప్ వెల్లడించారు. అందుకే ఆ స్టెప్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయిందని చెప్పారు. ఇప్పుడు థియేటర్లలో ఆ పాట వచ్చిందంటే చాలు, అభిమానులు కుర్చీల్లో కూర్చోకుండా స్టెప్స్ వేస్తుండటమే దీనికి నిదర్శనం.