అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chennai | డబ్బే అన్నిటికీ కొలమానం అనే భావన పెరుగుతున్న ఈ రోజుల్లో, చెన్నైకి చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు (Sanitation Worker) తన నిజాయతీతో సమాజానికే గుణపాఠం చెప్పింది. రోడ్డుపై దొరికిన దాదాపు రూ.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఏమాత్రం ఆశపడకుండా పోలీసులకు అప్పగించి, “మానవత్వం ఇంకా బతికే ఉంది” అని నిరూపించింది.
చెన్నైలోని టీనగర్ ప్రాంతం (TNagar Area)లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న పద్మ అనే మహిళ, ఆదివారం మధ్యాహ్నం తన విధులను నిర్వర్తిస్తూ చెత్తను సేకరిస్తుండగా రోడ్డుపక్కన ఒక బ్యాగ్ పడివుండటాన్ని గమనించింది. సాధారణంగా చెత్తగా భావించి వదిలేయవచ్చు గానీ, అనుమానంతో ఆ బ్యాగ్‌ను తెరిచి చూసింది. అందులో భారీగా బంగారు ఆభరణాలు ఉండటాన్ని చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. సుమారు 45 సవర్ల (దాదాపు 360 గ్రాములు) బరువున్న ఆ నగల విలువ మార్కెట్ ధరల ప్రకారం సుమారు రూ.45 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.
Chennai | నిజాయితీకి మారు పేరు..
అంత విలువైన సొత్తు ఎదురైనప్పటికీ, పద్మ క్షణం కూడా తప్పుదారి పట్టలేదు. “పరాయి సొమ్ము మనసుకు శాంతి ఇవ్వదు” అనే భావనతో వెంటనే ఆ బ్యాగ్‌ను తీసుకుని సమీపంలోని పాండిబజార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారులకు అప్పగించింది. ఆమె చూపిన బాధ్యతాయుతమైన ప్రవర్తన అక్కడున్న పోలీసులకే కాదు, తర్వాత ఈ విషయం తెలిసిన వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అదే సమయంలో నంగనల్లూరుకు చెందిన రమేష్ అనే వ్యక్తి తన బంగారు నగల బ్యాగ్ (Gold Bag) పోయిందని ఫిర్యాదు చేయడం జరిగింది. బ్యాంకు వేలాల్లో నగలను కొనుగోలు చేసి వాటిని విక్రయించే వ్యాపారం చేసే రమేష్, ఆదివారం జరిగిన వేలంలో కొనుగోలు చేసిన నగలతో ప్రయాణిస్తుండగా టీనగర్ ప్రాంతంలో అనుకోకుండా ఆ బ్యాగ్ జారిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
అన్ని ఆధారాలు సరిపోల్చిన అనంతరం పోలీసులు ఆ నగలను రమేష్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు పద్మ చూపిన నిజాయతీని బహిరంగంగా ప్రశంసించారు. తన జీవితంలో ఎప్పుడూ చూడని అంత విలువైన బంగారం ఎదురైనా, ఒక్క రూపాయి ఆశించకుండా తిరిగి ఇచ్చిన ఆమెను రమేష్ కూడా హృదయపూర్వకంగా అభినందించారు. ఈ ఘటన సోషల్ మీడియా (Social Media)లో వైరల్ కావడంతో, నెటిజన్లు పద్మను “నిజాయతీకి బ్రాండ్ అంబాసిడర్”, “సమాజానికి ఆదర్శం” అంటూ కొనియాడుతున్నారు. డబ్బుకన్నా విలువలు గొప్పవని మరోసారి నిరూపించిన పద్మ కథ ఇప్పుడు అందరికీ ప్రేరణగా మారింది.