అక్షరటుడే, వెబ్డెస్క్ : Suryapet | సూర్యాపేట జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. కారు బోల్తా పడి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి చెందింది.
సంక్రాంతి సెలవుల (Sankranti Holidays) తర్వాత తొలి రోజు బడికి వెళ్లిన ఆ టీచర్ను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. శనివారం ఉదయం విధులకు వెళ్తున్న ఉపాధ్యాయుల కారు బోల్తా పడింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం (Tungaturthi Constituency) అర్వపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. పాఠశాలలు ప్రారంభం కావడంతో నల్గొండ నుంచి కారులో పాఠశాలలకు ఐదుగురు ఉపాధ్యాయులు బయలు దేరారు. వీరి కారు అర్వపల్లి (Arvapalli) దగ్గరకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిలో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్సులో సూర్యాపేట ఏరియా ఆస్పత్రి (Suryapet Area Hospital)కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధ్యాయురాలి మృతితో ఆమె పనిచేసే పాఠశాలలో విషాదం నెలకొంది.