అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Khammam | రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలా మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. చలికాలం ప్రారంభం అయిన తర్వాత రోడ్డు ప్రమాదాలు పెరిగాయి.
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. టాటా ఆల్టోజ్ కారు (Tata Altoz Car)లో ఐదుగురు యువకులు వియం బంజర్ వైపు నుంచి సతుపల్లి వెళ్తున్నారు. కిష్టారం, అంబేద్కర్ కాలనీ వద్ద డివైడర్‌ను వీరి కారు ఢీకొంది. ప్రమాదంలో సత్తుపల్లి (Sathupalli)లోని కొంపల్లి కాలనీ చెందిన జయ్, శశి, మహబూబ్ నగర్ చెందిన సాజిద్ మృతి చెందారు. మరో ఇద్దరు తలారి అజయ్, ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడ్డ యువకులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Khammam | టిప్పర్ బీభత్సం
హైదరాబాద్ (Hyderabad) నగరంలో మంగళవారం అర్ధరాత్రి టిప్పర్ బీభత్సం సృష్టించింది. మలక్‌పేట చౌరస్తా టీవీ టవర్స్ సమీపంలో అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత టిప్పర్ అదుపుతప్పి బస్సు, లారీలను ఢీకొంది. అనంతరం మెట్రో బ్రిడ్జి కింద డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనంతరం పోలీసులు టిప్పర్‌ను అక్కడి నుంచి తరలించారు.
Khammam | ప్రాణం తీస్తున్న వేగం
చలికాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా తెల్లవారుజామున పొగమంచు కారణంగా రోడ్డుపై ఉన్న వాహనాలు కనిపించవు. అంతేగాకుండా మంచు కురవడంతో రోడ్లపై వాహనాలు స్కిడ్ అవుతాయి. కాబట్టి అతివేగంగా వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
