అక్షరటుడే, వెబ్‌డెస్క్: Camel milk | ఆవు, గేదె, మేక.. పాలు ఏ జంతువువి అయినా, సరైన ఉష్ణోగ్రత వద్ద సులభంగా పెరుగుగా మారతాయి. అయితే, ప్రపంచంలో ఒకే ఒక్క జంతువు పాలు మాత్రం ఎంత ప్రయత్నించినా పెరుగుగా కావు.
అవే ఒంటె పాలు. పోషకాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఒంటె పాలు పెరుగుగా ఎందుకు మారవు..? పాల ప్రపంచంలో ఈ అరుదైన మినహాయింపు వెనుక దాగి ఉన్న రెండు ముఖ్యమైన శాస్త్రీయ కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
Camel milk | శాస్త్రీయ కారణాలు:
పాలు ఆరోగ్యం, పోషకాహారానికి ముఖ్య వనరు. కాల్షియం, ప్రోటీన్, విటమిన్లతో నిండిన పాల ఉత్పత్తులు (పెరుగు, నెయ్యి, పన్నీర్) మన దైనందిన జీవితంలో భాగం. పెరుగు తయారీలో పాలలో సహజంగా ఉండే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది పాల చక్కెర (లాక్టోస్) ను విచ్ఛిన్నం చేసి లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది. ఆమ్లత్వం పెరిగి పాలు చిక్కగా అయ్యి పెరుగుగా మారుతాయి. అయితే, ఒంటె పాల విషయంలో ఈ ప్రక్రియ జరగదు.
Camel milk | లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా తక్కువగా ఉండటం:
ఒంటె పాలలో పెరుగు తయారీకి అవసరమైన లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. తగినంత బ్యాక్టీరియా లేకపోవడం వల్ల, పాలు పులియడం (కిణ్వ ప్రక్రియ) జరగదు. దీంతో పాలు ఆమ్లంగా మారవు, గడ్డకట్టవు, ఫలితంగా పెరుగు ఏర్పడదు.
Camel milk | ప్రత్యేకమైన రసాయన నిర్మాణం (చిన్న ప్రోటీన్ అణువులు):
ఒంటె పాల రసాయన నిర్మాణం ఆవు లేదా గేదె పాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దానిలోని ప్రోటీన్ అణువులు చాలా చిన్నవిగా ఉంటాయి.
ఈ చిన్న అణువులు సులభంగా ఒకదానితో ఒకటి కలిసి ఉండవు. కాబట్టి, పాలను ఎంత వేడి చేసినా, పులియబెట్టినా లేదా ఎంతసేపు ఉంచినా, అవి పెరుగుగా చిక్కబడవు.
ఈ ప్రత్యేక స్వభావం కారణంగానే ఎడారి ప్రాంతాలలో ప్రజలు ఒంటె పాలను పెరుగుకు బదులుగా తాజాగా తాగడానికి ఇష్టపడతారు. ఒంటె పాలు పెరుగుగా మారకపోయినా, అవి విటమిన్ సీ తో సమృద్ధిగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంచి, చర్మం, గుండె ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.
