101
అక్షరటుడే, బాన్సువాడ: Birkur Mandal | అర్ధరాత్రి ఇంట్లో చోరీకి వచ్చిన ఓ దుండగుడు మద్యం మత్తులో బయటపడలేక అక్కడ నిద్రపోయాడు. ఈ ఘటన బీర్కూర్ మండల (Birkur Mandal) కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ మండల కేంద్రంలో ఇంటి యజమాని మాలి పటేల్ ఇటీవల కొత్తగా నిర్మించిన ఇంట్లోకి మారాడు. పాత ఇంటికి తాళం వేసి ఉంచాడు. అయితే సోమవారం ఉదయం దీపం పెట్టేందుకు పాత ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లగా ఇంట్లో వంట, పూజ సామాగ్రి, చిల్లర డబ్బులు సంచిలో నింపుకుని పడుకున్న దొంగ కనిపించాడు. వెంటనే మాలి పటేల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.