అక్షరటుడే, వెబ్డెస్క్ : Cabinet Meeting | మేడారం (Medaram)లో ఆదివారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ (Hyderabad) బయట మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. మేడారం హరిత హోటల్లో మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ మీటింగ్ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సమావేశానికి ముందు సీఎం రేవంత్రెడ్డి మేడారంలోని అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ తదితరులు ఉన్నారు. మంత్రులతో కలిసి బస్సులో జంపన్న వాగు సర్కిల్ వరకు ప్రయాణించారు. మేడారం జాతర కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల కోసం కల్పించిన వివిధ సౌకర్యాలను సమీక్షించారు. మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు హాజరయ్యే భక్తుల సౌకర్యం, భద్రత కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
మెట్రో ఫేజ్ 2 కు రూ. 2,787 కోట్ల కేటాయింపు
మెట్రో ఫేజ్ 2ఏ, ఫేజ్ 2బీ భూసేకరణకు సంబంధించి కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.2,787 కోట్ల కేటాయింపునకు మంత్రులు ఆమోద ముద్ర వేశారు. దీనికితోడు ములుగు జిల్లాలో సాగునీరు అందించేందుకు పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2027లో జులై 27- ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బాసర-భద్రాచలం వరకు గోదావరి నది వెంట ఉన్న పురాతన ఆలయాలను శాశ్వతంగా అభివృద్ధి చేయాలని, ఎకో పార్కులు నిర్మించాలని మంత్రులు నిర్ణయించారు. మేడారంలో శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించారు.