Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | రూ.1.85 కోట్ల అప్పు చేసి.. కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వ్యాపారి

Kamareddy | రూ.1.85 కోట్ల అప్పు చేసి.. కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వ్యాపారి

కామారెడ్డి పట్టణంలో ఓ వ్యాపారి కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. రూ.1.85 కోట్ల అప్పు చేసిన ఆయన ఇంటి గోడకు లేఖ అతికించి మరీ వెళ్లిపోవడం తీవ్ర చర్చకు దారితీసింది.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కామారెడ్డి పట్టణంలో ఓ వ్యాపారి కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. రూ.1.85 కోట్ల అప్పు చేసిన ఆయన ఇంటి గోడకు లేఖ అతికించి మరీ వెళ్లిపోవడం గమనార్హం. దీంతో సదరు వ్యాపారికి అప్పు ఇచ్చిన వారు ఆందోళనకు గురవుతున్నారు.

కామారెడ్డి పట్టణానికి (Kamareddy Town) చెందిన ఓ వ్యాపారి రాం మందిర్ రోడ్డులో సూపర్​ మార్కెట్ (Super Market)​ నిర్వహిస్తుంటాడు. అతనికి వ్యాపారంలో రూ.కోటి 85 లక్షల అప్పులయ్యాయి. అందులో తనకు ఉన్న సూపర్ మార్కెట్​కు వివిధ ఏజెన్సీల నుంచి తీసుకువచ్చిన సామగ్రికి సంబంధించిన అప్పుతో పాటు, బ్యాంక్​ లోన్​, మరొక వ్యాపారి వద్ద తీసుకున్న అప్పు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో పట్టణం విడిచి వెళ్లిపోయాడు. తనకు ఓ వ్యాపారి నుంచి ప్రాణహానీ ఉందని లేఖ రాసి మరీ వెళ్లడం పట్టణంలో తీవ్ర చర్చకు దారి తీసింది.

Kamareddy | అప్పులు తీరుస్తా..

కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు, సెక్రెటరీకి సదరు వ్యాపారి లేఖ రాసి, ఇంటి గోడకు అతికించాడు. బ్యాంకు, ఇతర వ్యక్తులు, ఏజెన్సీతో సహా మరొక రైస్ మిల్ వ్యాపారి వద్ద అప్పులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నాడు. రైస్ మిల్ వ్యాపారి తన కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేస్తున్నాడని, అతని నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించాడు. అందుకే కామారెడ్డి వదిలి వెళ్లిపోతున్నామని తెలిపాడు. ఆస్తులు అమ్మి అందరి అప్పులు సెటిల్ చేస్తానని లేఖలో పేర్కొన్నారు.

తన ప్రాపర్టీ కొనడానికి ఓ వ్యక్తి ముందుకు వచ్చాడని, డబ్బులు రావడానికి సమయం పడుతుందని రాశాడు. డబ్బులు రాగానే అప్పులు తీర్చేస్తానని పేర్కొన్నారు. తనకు కొంత సమయం ఇవ్వాలని, అప్పులన్నీ తీర్చేసి మళ్లీ కామారెడ్డిలో వ్యాపారం కొనసాగిస్తానని లేఖలో వెల్లడించారు. ఈ ఘటన కామారెడ్డిలో కలకలం రేపింది.

Must Read
Related News