అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bus Accident | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల విద్యార్థుల విహారయాత్ర బస్సు ప్రమాదం కలకలం రేపిన నేపథ్యంలో, ఆ ఘటన మరిచిపోకముందే మరో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.
నంద్యాల జిల్లా (Nandyal District) శిరివెళ్ల మండల పరిధిలోని శిరివెళ్లమెట్ట వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల సమాచారం ప్రకారం, నెల్లూరు నుంచి హైదరాబాద్ (Nellore to Hyderabad)కు 36 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఏఆర్‌బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ (ARBCVR Private Travels)కు చెందిన బస్సు బుధవారం అర్ధరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత శిరివెళ్లమెట్ట వద్దకు చేరుకుంది.
Bus Accident | వరుస ప్రమాదాలు..
ఈ సమయంలో బస్సు టైరు ఒక్కసారిగా పేలడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. అదుపుతప్పిన బస్సు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొంది. ఢీకొన్న వెంటనే బస్సుకు మంటలు చెలరేగి క్షణాల్లోనే దగ్ధమైంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న డీసీఎం వాహనం డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగులగొట్టాడు. దీంతో ప్రయాణికులు కిటికీల ద్వారా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.
ఈ ఘటనలో పది మందికిపైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, వారిని వెంటనే నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (Nandyal Government General Hospital)కి తరలించారు. ప్రమాదంలో బస్సుతో పాటు లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల లగేజీ మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చి సహాయక చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదం నేపథ్యంలో రాత్రివేళ ప్రయాణాలు, ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.