Homeబిజినెస్​electric vehicle | అధిక మైలేజీ పేరుతో మోసం.. నియాన్‌ మోటార్స్, మహీంద్రాకు భారీ జరిమానా

electric vehicle | అధిక మైలేజీ పేరుతో మోసం.. నియాన్‌ మోటార్స్, మహీంద్రాకు భారీ జరిమానా

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: electric vehicle : మైలేజీ విషయంలో వినియోగదారుడిని మహీంద్రా అండ్‌ మహీంద్రా, నియాన్‌ మోటార్స్​ సంస్థలు మభ్య పెట్టినట్లు నిర్ధారించిన హైదరాబాద్‌ కమిషన్‌-2.. ఆ సంస్థలకు భారీగా జరిమానా విధించింది. ఫిర్యాదుదారుడి మానసిక వేదనను పరిగణనలోకి తీసుకొని రూ.5 లక్షల పరిహారం, రూ.10 వేలు కేసు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. తీర్పు వెలువడిన 45 రోజుల్లో మొత్తం చెల్లించాలని, లేకుంటే 12 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

జీహెచ్​ఎంసీ పరిధిలోని బల్కంపేటకు చెందిన చెన్నంశెట్టి సతీశ్​ కుమార్‌ తాడ్‌బండ్‌లోని నియాన్‌ మోటార్స్‌లో మార్చి, 2023లో ఎక్స్‌యూవీ – 400 విద్యుత్తు వెహికల్​ను రూ.19,63,306కు కొనుగోలు చేశారు. సంప్రదింపుల సమయంలో 100 శాతం ఛార్జింగ్‌తో 456 కిలోమీటర్లు, 80 శాతంతో 364 కిలోమీటర్లు తిరుగుతుందని కంపెనీవారు చెప్పారు. కానీ, 240 కిలోమీటర్లకు మించి మైలేజీ రాకపోవడంతో నియాన్‌ మోటార్స్, తయారీ సంస్థల ప్రతినిధులను సతీశ్​ కుమార్‌ సంప్రదించారు.

కారును లోటు పాట్ల పరిశీలన నిమిత్తం సర్వీసింగ్‌ సెంటర్‌కు పంపినా.. మైలేజీ పెరగలేదు. దీంతో ఎక్స్‌ఛేంజ్‌లో మరో వాహనాన్ని ఇవ్వాలని సతీశ్​ కుమార్‌ అభ్యర్థిస్తే వారు పట్టించుకోలేదు. ఆవేదన చెందిన సతీశ్​ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ప్రతివాద సంస్థలు ఫిర్యాదు దారుడి ఆరోపణలను ఖండించాయి. కమిషన్​ ఆదేశాల మేరకు కారు మైలేజీ విషయంలో సంయుక్త అధ్యయనం చేస్తే.. టెస్ట్‌ డ్రైవ్‌లో 11 శాతం బ్యాటరీ ఖర్చుతో 23.7 కి.మీ.గా వచ్చింది. దీంతో ప్రతివాద సంస్థలకు హైదరాబాద్‌ కమిషన్‌-2 భారీ జరిమానా విధించింది.