అక్షరటుడే, వెబ్‌డెస్క్ : T20 World Cup | వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30 నుంచి సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా (Team India) తలపడనుంది.
అయితే ఈ కీలక సమయంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం బయటకు వచ్చింది. సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్ టీ20 ఫైనల్‌కు ముందు హార్దిక్ తొడ కండరాలకు తీవ్రమైన గాయం ఏర్పడింది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (National Cricket Academy)లో రిహాబ్ తీసుకుంటున్న ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
T20 World Cup | యువ ఆటగాళ్లకు ఛాన్స్?
ఒకేసారి 50 ఓవర్ల మ్యాచ్‌లు ఆడటం ప్రమాదకరమని భావించిన బీసీసీఐ (BCCI) మెడికల్ టీమ్, హార్దిక్‌కు వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ వరకు చిన్న ఫార్మాట్‌పైనే దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. దీని వలన సౌతాఫ్రికా వన్డేలు ఆయనకు దూరమే అయ్యే అవకాశం ఉన్నది. ఫాస్ట్ బౌలర్ల వర్క్‌లోడ్‌ను జాగ్రత్తగా నిర్వహించే వ్యూహంలో భాగంగా బుమ్రాకు కూడా విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. సౌతాఫ్రికా వన్డే సిరీస్ టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) సన్నాహకాలలో అంత ప్రాధాన్యం గలది కాదని భావిస్తూ, ఈ సిరీస్‌ను యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఉపయోగించవచ్చని అంతర్గతంగా చర్చ నడుస్తోంది.
బుమ్రా , హార్దిక్ (Hardik Pandya) వంటి సీనియర్ ఆటగాళ్లు దూరమైతే, ఈ వన్డే సిరీస్‌లో బెంచ్‌పై ఉన్న యువ ఆటగాళ్లకు తమ ప్రతిభ నిరూపించుకునే మంచి అవకాశం లభించనుంది. భవిష్యత్తులో 50 ఓవర్ల ఫార్మాట్‌లో జట్టు మార్పులు ఎలా ఉంటాయనే దానిపై ఈ సిరీస్ మంచి సూచనలను ఇచ్చే అవకాశం ఉంది. అయితే హార్దిక్ రీ-ఎంట్రీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఉంటుంది. హార్దిక్ ముందుగా సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున ఆడి ఫిట్‌నెస్ టెస్ట్ నిరూపించుకోనున్నాడు. అనంతరం సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లలో పాల్గొంటాడు. టీ20 ప్రపంచ కప్ 2026 వరకు భారత జట్టులో చిన్న ఫార్మాట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉండబోతోంది. ఐపీఎల్ ముగిసిన తరువాతే సీనియర్ ఆటగాళ్లు 2027 వన్డే వరల్డ్ కప్ సైకిల్‌పై దృష్టి పెట్టనున్నారు.
