అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TDR Bonds | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో జల వనరుల సంరక్షణతోపాటు, భూముల స్వాధీనం కోసం భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు చేసింది.
కోర్ అర్బన్ రీజియన్ (Core Urban Region) పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో భూములకు బదిలీ చేయగల అభివృద్ధి హక్కుల (TDR) మంజూరును నియంత్రించడానికి, హేతుబద్ధీకరించడానికి ప్రభుత్వం భవన నిబంధనలు 2012ను సవరించింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు మరియు NGT ఆదేశాలను అనుసరించి ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. నీటి వనరుల రక్షణ, ఆక్రమణల తొలగింపు, FTL మరియు బఫర్ జోన్‌లలో నిర్మాణాన్ని నిషేధించడం తప్పనిసరి చేసింది.
TDR Bonds | టీడీఆర్ కొనాల్సిందే
నగరంలో పది అంతస్తులకు మించి భవనాలు నిర్మించే సంస్థలు, వ్యక్తులు తప్పనిసరిగా టీడీఆర్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నదులు, చెరువులు, నాలాల సమీపంలోని భూములను ప్రభుత్వం టీడీఆర్ ఇచ్చి స్వాధీనం చేసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 300 వార్డులలో ఈ నిబంధన అమలులోకి రానుంది.
TDR Bonds | టీడీఆర్ అంటే ఏమిటి
చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో, నదులు, నాలాల సమీపంలో పట్టా భూములు ఉంటాయి. ఆయా జలవనరుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుంటుంది. అయితే మిగతా ప్రాంతాల్లో పరిహారంగా నగదు అందజేస్తారు. అయితే హైదరాబాద్ (Hyderabad) పరిధిలో మాత్రం టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) జారీ చేస్తారు. వీటిని అమ్ముకొని భూములు కోల్పోయిన వారు నగదు తీసుకునే అవకాశం ఉంది.
TDR Bonds | కొత్త నిబంధనల ప్రకారం..
చెరువులు, నదుల్లోని పట్టా భూములను స్వాధీనం చేసుకోవాల్సి వస్తే.. శిఖం భూముల విలువపై 200 శాతం, బఫర్ జోన్‌లోని భూములకు 300 శాతం, బఫర్ వెలుపలి భూములకు 400 శాతం టీడీఆర్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెరువులు, నదుల్లోని భూములను ప్రభుత్వానికి ఉచితంగా అందిస్తే.. సదరు సంస్థలు, వ్యక్తులు నిర్మించే ప్రాజెక్టులకు సెట్‌బ్యాక్, ఎత్తు నిబంధనలు సడలిస్తామని తెలిపింది.
TDR Bonds | ధర పడిపోవడంతో..
గత ప్రభుత్వ హయాంలో రూ.10 వేల కోట్ల విలువైన టీడీఆర్‌లు జారీ చేశారు. అయితే మార్కెట్లో టీడీఆర్‌లు పెరిగిపోవడంతో డిమాండ్ తగ్గి రేట్లు పడిపోయాయి. దీంతో భూములు కోల్పోతున్న వారు నగదు రూపంలో పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది అంతస్తులు దాటి నిర్మించే భవనాల్లో టీడీఆర్ తప్పనిసరి చేసింది. పదకొండో అంతస్తు నుంచి చివరి అంతస్తు వరకు మొత్తం నిర్మాణ విస్తీర్ణంలో పది శాతానికి టీడీఆర్ ద్వారా రుసుము చెల్లించాలి. దీంతో టీడీఆర్‌కు డిమాండ్ పెరిగి రేట్లు పెరిగే అవకాశం ఉంది.