అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kukatpally MLA | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై (Kalvakuntla Kavitha) కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అవినీతి చిట్టా తన వద్ద ఉందన్నారు. కవితకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కంటే పెద్ద ఇల్లు ఉందని, అది ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
కవిత (Kalvakuntla Kavitha) ఇటీవల జాగృతి జనంబాట కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు, గత బీఆర్ఎస్ పాలనపై ఆమె విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు టార్గెట్‌గా అనేక ఆరోపణలు చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సైతం వదలడం లేదు. సోమవారం కవిత కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావుపై (BRS MLA Krishna Rao) ఆమె ఆరోపణలు చేశారు. కవిత వ్యాఖ్యలపై మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే స్పందించారు. కవిత జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.
Kukatpally MLA | కేజ్రీవాల్‌ను ఆగం చేసింది
తెలంగాణలో తిరగడానికి కవితకు అసలేం హక్కు ఉందని కృష్ణారావు ప్రశ్నించారు. ఢిల్లీలో మంచి పేరు ఉన్న కేజ్రీవాల్‌ని ఆగం చేశారన్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక్కడ కేసీఆర్, కేటీఆర్‌లను నాశనం చేసే కవిత ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ‘మర్యాదతో చెప్తున్నా’ ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. కవిత మంచి వ్యక్తి కాకపోవడంతోనే పార్టీ సస్పెండ్ చేసిందన్నారు. పదేళ్లు అధికారం అనుభవించనప్పుడు బీసీలు ఎందుకు గుర్తురాలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు బీసీలను కాపాడటానికి ఆమె ఉందా అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రూ. కోట్లకు కోట్లు సంపాదించారని ఆరోపించారు. కవిత భర్తకు బాలనగర్లో 36 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చిందని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
Kukatpally MLA | మంత్రి పదవులు అమ్ముకున్నారు
కవిత చరిత్ర తనకు మొత్తం తెలుసని మాధవరం అన్నారు. ఆమె ఏ బంగారం దుకాణాన్ని వదల్లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసన్నారు. కేసీఆర్ (KCR)పై ఉన్న అభిమానంతో తాము ఇన్ని రోజులు కవితపై మాట్లాడలేదన్నారు. ఉద్యమం చేసి పార్టీ కోసం పని చేస్తున్న హరీశ్‌రావు (Harish Rao)ను పార్టీ నుంచి పంపించాలని కవిత కుట్రలు చేశారన్నారు. కవిత భర్త అక్రమాల వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు.