అక్షరటుడే, వెబ్డెస్క్ : KCR | రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS government) వస్తుందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. గ్రామాలకు మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు.
కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవెల్లి (Erravelli), నర్సన్నపేటలో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. వార్డు సభ్యులను సైతం ఏకగ్రీవంగా గెలిపించారు. వారు శుక్రవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవన్నారు. కొన్ని దశలు ఇబ్బందులను తెస్తాయని, కానీ మనం వాటికి భయపడకూడదని సూచించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దన్నారు.
KCR | దేశానికి ఆదర్శంగా..
ముఖ్యమంత్రిగా తాను ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా మారాయని కేసీఆర్ అన్నారు. పదేళ్ల BRS పాలనలో, తెలంగాణ గ్రామాలు స్వావలంబన, స్వయం పాలన గ్రామీణ ఆర్థిక కేంద్రాలుగా మారాయని చెప్పారు. ప్రస్తుతం కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. గంగాదేవిపల్లి వంటి విజయవంతమైన స్వావలంబన నమూనాలను ప్రేరణగా తీసుకోవాలన్నారు. ప్రజా భాగస్వామ్యంతో కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పాలనలో ఎవరో ఏదో చేస్తారని ఆశలు పెట్టుకుని ఆగం కావొద్దన్నారు.
