అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma House | రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma House scheme) తీసుకు వచ్చింది. తొలి విడతలో నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేసింది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటున్న వారికి విడతల వారీగా రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు తావు ఉండొద్దని ప్రభుత్వం ఆదేశించింది. అర్హులకే ఇల్లు మంజూరు చేయాలని, అనర్హులని తెలితే నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే ఎవరైన అధికారులు, నాయకులు ప్రజల నుంచి డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) హెచ్చరించారు. అయినా కూడా కొందరు అధికారులు, నాయకులు ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. తాజాగా ఓ పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం లంచం తీసుకుంటుండగా.. అధికారులు పట్టుకున్నారు.
Indiramma House | బిల్లుల మంజూరు కోసం..
మంచిర్యాల జిల్లా (Manchiryal district) కన్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా గొర్లపల్లి రాజ్ కుమార్ పని చేస్తున్నాడు. గ్రామానికి చెందిన ఓ మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా పనులు చేపడుతున్నారు. పనులు పూర్తయిన మేరకు బిల్లు కోసం ఫొటో తీసి యాప్‌లో నమోదు చేస్తే లబ్ధిదారుకు రూ.1.40 లక్షల బిల్లు వస్తుంది. దీనికోసం పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) రాజ్‌కుమార్ రూ.10 వేల లంచం డిమాండ్ చేశాడు. బాధితులు బతిమిలాటడంతో రూ.5 వేలకు ఒప్పుకున్నాడు. అనంతరం మహిళ భర్త ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడి నుంచి శుక్రవారం రాత్రి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శిని పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
