అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bomb Threat | పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. నోయిడా (Noida), అహ్మదాబాద్ (Ahmedabad)లోని స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ వచ్చాయి.
అహ్మదాబాద్‌లోని చాలా బడులకు బాంబు బెదిరింపులు మెయిల్ ద్వారా వచ్చాయని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (Crime Branch Police) శుక్రవారం తెలిపారు. దీంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ విభాగం దర్యాప్తు ప్రారంభించాయి. మరోవైపు నోయిడాలోని శివ్ నాడార్ పాఠశాల (Shiv Nadar School)కు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో శుక్రవారం పాఠశాలను మూసి వేశారు. విద్యార్థులను ఇళ్లకు పంపారు. శివ్ నాడార్ పాఠశాలతో పాటు, బాల భారతి పాఠశాల, కేంబ్రిడ్జ్ పాఠశాల (Cambridge School)కు సైతం బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయా స్కూళ్లను మూసివేసి పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ప్రైవేట్ పాఠశాలలకు పంపిన బెదిరింపు ఇమెయిల్‌ల గురించి సమాచారం అందగానే తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సీనియర్ అధికారులు, వివిధ పోలీసు స్టేషన్ల సిబ్బంది, బాంబు స్క్వాడ్, అగ్నిమాపక దళం, డాగ్ స్క్వాడ్, BDDS బృందాన్ని వెంటనే సైట్‌లలో మోహరించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నోయిడా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదన్నారు. మరోవైపు సైబర్ పోలీసులు (Cyber Police) ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందని దర్యాప్తు చేస్తున్నారు.