అక్షరటుడే, వెబ్డెస్క్ : Gali Janardhan Reddy | కర్ణాటకలోని బళ్లారి నగరంలో రణరంగం వాతావరణాన్ని సృష్టించే విధంగా బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆస్తికి దుండుగులు నిప్పుపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. కంటోన్మెంట్ ప్రాంతంలోని ‘జీ స్క్వేర్ లేఅవుట్’ (G Square Layout)లోని ఈ మోడల్ హౌస్ శుక్రవారం సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో దుండుగులు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
అయితే, ఘటన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడం పెద్ద ప్రమాదాన్ని తప్పించిందని అధికారులు పేర్కొన్నారు.ఈ మోడల్ హౌస్ (Model House) సుమారు 109 ఎకరాల స్థలంలో ఉంది. గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీరాములు పేర్లపై రిజిస్టర్ అయ్యి ఉంది. 13–14 ఏళ్ల క్రితం భవనాన్ని కొనుగోలుదారులను ఆకర్షించడానికి నిర్మించగా, ప్రస్తుతం దీని విలువ రూ. 3 కోట్లకు పైగా ఉంది. స్థానిక పోలీసుల ప్రకారం, దుండుగులు పెట్రోల్, డీజిల్ ఉపయోగించి నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది.
Gali Janardhan Reddy | రాజకీయ వైరం..
గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి ఈ ఘటన వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి (Congress MLA Nara Bharat Reddy) మద్దతుదారులు ఉన్నారని ఆరోపించారు. “ఇది ఒక్కసారిగా జరిగిన పని కాదు, రాజకీయ పరిస్ధితులను దృష్టిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా చేసినట్టుంది” అని ఆయన తెలిపారు. సీనియర్ పోలీసు అధికారులు (Senior Police Officers) సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇప్పటికే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై గాలి జనార్ధన్ రెడ్డి స్పందిస్తూ, “బ్యానర్ల గొడవ జరిగిన కొద్దిరోజులకే ఈ అగ్నిప్రమాదం సంభవించడం అనుమానాస్పదంగా ఉంది. బళ్లారి ఎస్పీతో మాట్లాడి బాధ్యులను గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని పేర్కొన్నారు.
ఇటీవలే గాలి జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ వర్గాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంతో ఈ సంఘటన రాజకీయ వైరాన్ని మరింతగా పెంచే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానికంగా భద్రతా చర్యలు పర్యవేక్షణలో ఉన్నాయి, బాధ్యులను త్వరగా గుర్తించడానికి పోలీసులు కృషి చేస్తున్నారు.