అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bijapur Maoist Encounter | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) జిల్లా బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. జంగ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
బీజాపూర్ జిల్లా (Bijapur District)లోని ఇంద్రావతి నది ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ సందర్భంగా, భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో ఇద్దరు యూనిఫాం ధరించిన మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయని బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర యాదవ్ తెలిపారు. భద్రతా సిబ్బంది సంఘటనా స్థలం నుంచి ఒక SLR రైఫిల్, ఒక INSAS రైఫిల్, 12-బోర్ రైఫిల్‌తో సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు, ఇతర మావోయిస్టు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ (Search Operation) కొనసాగుతోందని చెప్పారు. జనవరి 3న, బస్తర్ ప్రాంతంలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాలు 14 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. గత సంవత్సరం రాష్ట్రంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్లలో 285 మంది మావోయిస్టులు (Maoists) మరణించారు. మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ సెక్రెటరీ దేవ్‌జీ లొంగిపోయిన విషయం తెలిసిందే. చాలా మంది లొంగిపోవడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మరోవైపు బలగాలు మావోయిస్టుల కోసం ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.
