అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bihar Politics | బీహార్ రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉండి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish Kumar) నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)లో చేరబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ వార్తలను కాంగ్రెస్ పార్టీ (Congress Party) నేతలు తీవ్రంగా ఖండిస్తూ, ఇవన్నీ రాజకీయ ప్రత్యర్థులు సృష్టిస్తున్న పుకార్లేనని స్పష్టం చేస్తున్నారు.ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పలు అధికారిక కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది.
Bihar Politics | జంపింగ్..
జనవరి 13న పాట్నాలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ ‘దహీ–చూరా’ విందుకు కూడా వారు హాజరుకాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో, “సంక్రాంతి తర్వాత బీహార్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి” అంటూ ఎన్డీయే నేతలు చేసిన వ్యాఖ్యలు ఫిరాయింపుల ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నిక (Assembly Election)ల్లో కాంగ్రెస్ పార్టీ బీహార్‌లో కేవలం ఆరు సీట్లకే పరిమితమైంది. ఒకవేళ ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు జేడీయూలో చేరితే, కాంగ్రెస్ అసెంబ్లీలో పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు, అధికార ఎన్డీయేలో జేడీయూ బలం తన మిత్రపక్షమైన బీజేపీ కంటే పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ఎన్డీయేకు మొత్తం 202 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇందులో బీజేపీకి 89 మంది, జేడీయూకు 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు (Congress Leaders) పూర్తిగా ఖండించారు. బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ రామ్, మాజీ సీఎల్పీ నేత షకీల్ అహ్మద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, “మా ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఎలాంటి ఫిరాయింపులు జరగడం లేదు. ఇవన్నీ రాజకీయ ప్రత్యర్థులు మా కార్యకర్తల మనోభావాలని దెబ్బతీయడానికి వ్యాప్తి చేస్తున్న వదంతులే” అని స్పష్టం చేశారు. ఫిరాయింపులు లేవని కాంగ్రెస్ స్పష్టత ఇచ్చినప్పటికీ, పార్టీ అంతర్గత పరిస్థితిపై మాత్రం అనిశ్చితి నెలకొంది.