అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijayasai Reddy | రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయింది. కానీ రాజకీయ వాతావరణం మాత్రం రోజు రోజుకు మరింత వేడెక్కుతోంది. ఈ క్రమంలో వెలుగులోకి వస్తున్న కీలక అంశం మాజీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజా ట్వీట్లు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఘోర ఓటమి తర్వాత వైసీపీ లోపలి వర్గపోరు బయటపడింది.
జగన్ (YS Jagan) కోటరీతో విభేదాలు పెరగడంతో విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పారు. అంతేకాదు రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచే తప్పుకుంటున్నానని ప్రకటించారు. కానీ గత కొన్ని వారాలుగా ఆయన వ్యాఖ్యలు, ఇటీవల చేసిన ప్రకటనలు కొత్త రాజకీయ ఎత్తుగడలకు బేస్ అయినట్టుగా కనిపిస్తున్నాయి.
Vijayasai Reddy | ఆశ్చర్యపరిచిన రీ–ఎంట్రీ సంకేతం
ఇటీవలే విజయసాయిరెడ్డి “అవసరం అయితే రీ–ఎంట్రీ ఇస్తాను” అని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆ వెంటనే ఆదివారం ఆయన చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయ వేడి పెంచేసింది. హిందూ మతానికి వ్యతిరేకంగా జరిగే కుట్రలను అసలు సహించేది లేదని ఆయన తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు. డబ్బు ప్రలోభాలకు గురిచేసి మత మార్పిడులు చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, గత 20 ఏళ్ల మత మార్పిడులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దేశం కోసం, ధర్మం కోసం హిందువులందరు ఒక్కటవ్వాలి అని పిలుపునిచ్చారు . ఈ వ్యాఖ్యలతో విజయసాయిరెడ్డి ఆకస్మికంగా సనాతన ధర్మ రక్షణ స్టాండును ఎత్తుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక దాగిన ఉన్న రాజకీయ అర్థాలను విశ్లేషిస్తున్న అనలిస్టులు … ఆయనకు చిన్నప్పటి నుంచే జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ (BJP) నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. స్తుతం హిందూ మత పరిరక్షణపై ఆయన తీసుకున్న అగ్రెసివ్ స్టాండ్ బీజేపీ, జనసేన విధానాలతో దగ్గరగా ఉందని, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో తన స్నేహాన్ని ఆయన పదేపదే ప్రస్తావించడం కూడా ఇప్పటి చర్చకు బలం ఇస్తోందని అంటున్నారు . ఈ నేపథ్యంలో విజయసాయి బీజేపీలో చేరతారా? లేక పవన్ కళ్యాణ్ జనసేనలో జాయిన్ అవుతారా? అనే ప్రశ్న రాష్ట్రవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. పార్టీ నుంచి వైదొలిగిన తరువాత ఆయన స్పష్టంగా జగన్ కోటరీని బాధ్యులుగా పేర్కొన్నారు. కాకినాడ పోర్టు, లిక్కర్ కేసు (Liquor Case)లపై చేసిన సంచలన కామెంట్లు కూడా అప్పట్లో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు మరలా అదే కోటరీపై పరోక్ష విమర్శలు చేస్తున్నట్లు కనిపించడం, రాబోయే రాజకీయ అడుగులకు బలం చేకూర్చుతోంది