అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhogi 2026 | తెలుగు ప్రజల ఇళ్లల్లో అత్యంత సంప్రదాయబద్ధంగా, అంగరంగ వైభవంగా నిర్వహించుకునే పండుగలలో సంక్రాంతి Makar Sankranti అగ్రస్థానంలో నిలుస్తుంది. ముచ్చటగా మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో మొదటి రోజైన ‘భోగి’ పండుగ Bhogi festival కు ఒక ప్రత్యేకమైన స్థానం, ప్రాముఖ్యం ఉన్నాయి. దక్షిణాయనం ముగిసి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే ముందు వచ్చే ఈ పండుగ మన సంస్కృతికి అద్దం పడుతుంది. అయితే, 2026 సంవత్సరంలో భోగి పండుగ తేదీ విషయంలో సామాన్యుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. సాధారణంగా జనవరి 13న వచ్చే ఈ పండుగను, ఈ ఏడాది మాత్రం జనవరి 14వ తేదీన జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
Bhogi 2026 | షట్తిల ఏకాదశి తిథి..
తేదీలపై స్పష్టత: సౌరమాన గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మకర సంక్రమణం జరిగే సమయాన్ని బట్టి పండుగ తేదీలలో మార్పులు వచ్చాయి. మెజారిటీ పండితుల అభిప్రాయం ప్రకారం.. 2026 జనవరి 14న భోగి, జనవరి 15న మకర సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలను నిర్వహించుకోవాలి. ముఖ్యంగా జనవరి 13 మధ్యాహ్నం 3:18 గంటలకు షట్తిల ఏకాదశి తిథి ప్రారంభమై, జనవరి 14 సాయంత్రం 5:53 వరకు ఉండటం వల్ల 14వ తేదీనే భోగి వేడుకలు నిర్వహించుకోవడం శాస్త్రబద్ధం.
భోగి మంటల విశిష్టత: సంక్రాంతి అనగానే మొదట గుర్తుకు వచ్చేది భోగి మంటలు. ఈ మంటలు కేవలం చలిని తట్టుకోవడానికి మాత్రమే కాదు, ఇవి ఒక పవిత్రమైన ‘అగ్నిహోత్రం’తో సమానం. మనలోని చెడు ఆలోచనలను, ఇంట్లోని పాత వస్తువులను అగ్ని దేవుడికి సమర్పించి కొత్త జీవితానికి స్వాగతం పలకడమే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఈ మంటలు చల్లారిన తర్వాత వచ్చే భస్మాన్ని (బూడిదను) పిల్లలకు నుదుట ధరింపజేయడం వల్ల శుభం కలుగుతుందని పెద్దలు చెబుతారు.
ఆధ్యాత్మిక వేడుకలు – గోదా కళ్యాణం: భోగి రోజున ధనుర్మాసం పూర్తవుతుంది. గోదాదేవి శ్రీరంగనాథుడిలో ఐక్యమై ‘భోగం’ పొందిన రోజు కాబట్టి దీనిని భోగి అని కూడా అంటారు. అందుకే ఈ రోజున ఆలయాల్లో గోదా కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. వివాహం కాని యువతులు ఈ కళ్యాణాన్ని వీక్షించడం, రుక్మిణీ కళ్యాణం వంటి పఠించడం వల్ల శీఘ్రంగా వివాహం జరుగుతుందని నమ్మకం. అలాగే, సాయంత్రం వేళ చిన్న పిల్లలకు ‘అర్క ఫలం’ అని పిలిచే రేగు పళ్లను తల మీదుగా పోసి ఆశీర్వదించడం ఈ పండుగ ప్రత్యేకత. అభ్యంగన స్నానాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలతో భోగి పండుగ తెలుగు లోగిళ్లలో సరికొత్త వెలుగులు నింపనుంది.