అక్షరటుడే, వెబ్‌డెస్క్: BMW Review | మాస్ మహరాజా రవితేజ (Raviteja) కామెడీతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంలో ఎప్పుడూ ముందుంటారు. వెంకీ, దుబాయ్ శీను, కిక్.. ఇలా ఒకప్పటి మాట పక్కనపెడితే ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి సరైన కామెడీ ఎంటర్‌టైనర్ రాకపోవడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. సంక్రాంతికి మాత్రం లైట్ నోట్‌లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ ఫ్యామిలీ సినిమాతో వచ్చిన ఈ చిత్రంతో హిట్ కొట్టాడా లేదా అనేది చూద్దాం.
కథ:
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా ఎంటర్‌టైనర్ కథ మొత్తం ఇద్దరు మహిళల మధ్య ఇరుక్కున్న హీరో చుట్టూనే తిరుగుతుంది. ట్రైలర్ విడుదలైనప్పుడే సినిమా థీమ్ ఏంటో ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చేసింది. రామ్ సత్యనారాయణ (రవితేజ) ఇండియాలో సొంతంగా ఓ వైన్ కంపెనీ నడుపుతుంటాడు. విదేశీ బ్రాండ్లకే పరిమితం కాకుండా, తెలుగోడు తయారు చేసిన వైన్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో నిలబెట్టాలనే లక్ష్యంతో ‘అనార్కలి’ అనే కొత్త బ్రాండ్‌ను లాంచ్ చేస్తాడు. ఈ వైన్‌ను యూరప్ మార్కెట్‌లో ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో స్పెయిన్‌లోని ఓ ప్రముఖ వైన్ కంపెనీతో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తాడు. అయితే అక్కడ నుంచి నిరాశే ఎదురవుతుంది. కారణాలు తెలుసుకోవాలనే ఆతృతతో తన అసిస్టెంట్ లీల (వెన్నెల కిషోర్)తో కలిసి స్పెయిన్ వెళ్లిన రామ్, అనుకోని పరిస్థితుల్లో ఆ కంపెనీ ఎమ్‌డీ మానస (ఆషికా రంగనాథ్)కు దగ్గరవుతాడు.
బిజినెస్ పేరుతో మొదలైన పరిచయం కాస్త వ్యక్తిగతంగా మారిపోతుంది. ఈ క్రమంలో తనకు ఇప్పటికే పెళ్లయిందన్న నిజాన్ని, భార్య బాలామణి (డింపుల్ హయాతీ) ఉన్న విషయాన్ని మానసకు దాచేస్తాడు. స్పెయిన్ మిషన్ ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చిన రామ్‌కు అసలు పరీక్ష అప్పుడే మొదలవుతుంది. అనుకోకుండా మానస కూడా హైదరాబాద్‌లో (Hyderabad) అడుగుపెట్టడంతో, తన డబుల్ లైఫ్‌ను మ్యానేజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నిజం ఎప్పుడు బయటపడుతుంది? మానస, బాలామణి మధ్య పరిస్థితులు ఎలా మారతాయి? చివరకు రామ్ కథ ఏ మలుపు తిరుగుతుందన్నదే ఈ ఎంటర్‌టైనర్‌లో ఆసక్తికరంగా చూపించారు.
నటీనటుల పర్‌ఫార్మెన్స్:
మాస్ మహారాజా రవితేజ నుంచి ఈ సినిమాతో కొత్తగా ఆశించే నటనేమీ కనిపించదు. ఇలాంటి క్యారెక్టర్లు ఆయనకు బాగా అలవాటైనవే కావడంతో, ఎలాంటి ప్రత్యేక ప్రయత్నం చేయకుండా కథ ఫ్లోలో సింపుల్‌గా సాగిపోయారు. ఎనర్జీ, టైమింగ్ మాత్రం రవితేజ స్టైల్‌లోనే ఉన్నాయి కానీ, ఆశ్చర్యపరిచే స్థాయిలో ఏమీ కొత్తగా కనిపించలేదు. డింపుల్ హయతి (Dimple Hayathi) పాత్ర కథలో కీలకంగా కనిపించినప్పటికీ, నటనకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఆమెకు పూర్తిగా తన ప్రతిభను చూపించే అవకాశం దక్కలేదు. పాత్ర బలం ఉన్నా, స్క్రీన్‌పై చేయడానికి తక్కువ స్పేస్ ఉండడం ఆమెకు మైనస్ అయ్యింది. అయితే ఈ సినిమాలో అసలైన హైలైట్ మాత్రం ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) అనే చెప్పాలి. గ్లామర్‌తో పాటు నటన పరంగానూ ఆమె పూర్తి మార్కులు కొట్టేసింది.
స్టైలిష్ లుక్స్, బోల్డ్ ప్రెజెన్స్‌తో స్క్రీన్‌ను హీట్ ఎక్కించడమే కాకుండా, పాత్రకు కావాల్సిన ఎమోషన్‌ను కూడా బాగా క్యారీ చేసింది. ఈ సినిమాకు ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాలంటే అది నిస్సందేహంగా ఆషికాకే దక్కుతుంది. కామెడీ విషయానికి వస్తే, సత్య తన స్క్రీన్ టైమ్ ఉన్నంతసేపు ప్రేక్షకులను నవ్వించాడు. అయితే కొంత దశ తర్వాత ఆయన హాస్యం ఓవరుగా అనిపించే సందర్భాలు కూడా ఉన్నాయి. వెన్నెల కిషోర్ పంచ్ డైలాగ్స్ అక్కడక్కడ బాగానే పేలాయి. కానీ సునీల్, మురళీధర్, రోహన్ పాత్రలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. మొత్తంగా నటీనటుల పరంగా సినిమా మిక్స్‌డ్ ఫీలింగ్‌ను మిగిల్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టెక్నికల్ పర్‌ఫార్మెన్స్
సాంకేతికంగా పరిశీలిస్తే, కథ పరంగా బలహీనంగా ఉన్న కొన్ని సన్నివేశాలను భీమ్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొంతవరకు నిలబెట్టింది. నేపథ్య సంగీతం సీన్స్‌కు ఎనర్జీని జోడించగా, పాటలు వినడానికి బాగానే ఉన్నాయి. అయితే అవి కథ ప్రవాహంలో సహజంగా కలవకపోవడం, తరచుగా వరుసగా రావడం వల్ల తెరపై ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల విదేశీ లొకేషన్లు, గ్లామర్ విజువల్స్‌ను తన కెమెరాతో ఆకట్టుకునేలా చూపించారు. కథలో పట్టు లేకపోయినా, సన్నివేశాలు మాత్రం కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా కనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రతీ ఫ్రేమ్‌లో ఖర్చు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
అయితే ఈ అన్ని సాంకేతిక బలాలు ఉన్నప్పటికీ, కథా కంటెంట్‌పై మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా ఫలితం ఇంకాస్త భిన్నంగా ఉండేదన్న భావన ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. విజువల్స్, మ్యూజిక్‌తో పాటు బలమైన కథ కూడా ఉంటే అవుట్‌పుట్ మరో స్థాయికి వెళ్లేదని విశ్లేషకులు అంటున్నారు.
ప్లస్ పాయింట్స్:
కామెడీ సన్స్
రవితేజ నటన
ఫ్యామిలీ ఎలిమెంట్స్
గ్లామర్
మైనస్ పాయింట్స్
పాత కథ
జబర్ధస్త్ తరహా కామెడీ
సెకండాఫ్
నటీనటులు : రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, సునీల్, సత్య, తారక్ పొన్నప్ప, వెన్నెల కిషోర్, సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు
దర్శకత్వం : కిషోర్ తిరుమల
నిర్మాత : చెరుకూరి సుధాకర్
మ్యూజిక్ : భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫి : ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
విశ్లేషణ:
కొత్తదనం అనే అంశాన్ని పక్కన పెట్టి పూర్తిగా కామెడీపై ఆధారపడిన రొమాంటిక్–ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. కథకు బలమైన పాయింట్ లేకపోవడంతో సినిమా మొత్తంగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. స్క్రీన్‌ప్లేలో పొంతనలేమి, కొన్ని సన్నివేశాల పునరావృతం కావడం కూడా సినిమాకు ప్రధాన మైనస్‌గా మారాయి. అయితే పూర్తిగా నిరాశపరచని అంశాలు కూడా ఉన్నాయి. కొన్ని కామెడీ సీన్స్ మాత్రం థియేటర్లలో నవ్వులు పూయించడంలో సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా సత్య, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు అక్కడక్కడ మెప్పిస్తాయి. అలాగే ఆషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.
మొత్తానికి ఇది బలమైన కథ కోసం కాకుండా, లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూసే వారికి ఒకసారి చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు. కామెడీ, గ్లామర్‌ను ఆస్వాదించే ప్రేక్షకులకు కొంతవరకు సరిపడే వినోదాన్ని అందిస్తుంది.
రేటింగ్ : 2/5