అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bengaluru | బెంగళూరు నగరంలోని రామ్మూర్తి నగర్‌లో (Rammurthy Nagar) వారం రోజుల క్రితం చోటు చేసుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి కేసు పోలీసు దర్యాప్తులో సంచలన మలుపు తిరిగింది. తొలుత సాధారణ అగ్నిప్రమాదంగా భావించిన ఈ ఘటన.. పూర్తిగా పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా తేలింది.
లోతైన విచారణలో బయటపడ్డ నిజాలు పోలీసులనే కాదు, నగర వాసులను కూడా షాక్‌కు గురి చేస్తున్నాయి. మంగళూరుకు చెందిన 34 ఏళ్ల షర్మిల బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ (Accenture)లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. జనవరి 3వ తేదీన ఆమె నివాసంగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పొగ ఎక్కువగా వ్యాపించడంతో ఆమె ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Bengaluru | లోతైన దర్యాప్తులో వెలుగులోకి ..
ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని భావించారు. సంఘటనా స్థలంలో ఎలాంటి స్పష్టమైన అనుమానాస్పద ఆధారాలు లేకపోవడంతో ఇది ప్రమాదమేనని అందరూ అనుకున్నారు. అయితే కేసును వదిలిపెట్టకుండా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడు కర్నల్ కురై అనే వ్యక్తి, జనవరి 3వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో స్లైడింగ్ విండో ద్వారా షర్మిల ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెపై లైంగిక దాడికి యత్నించగా, షర్మిల తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ పెనుగులాటలో నిందితుడు ఆమె నోరు, ముక్కును బలవంతంగా మూసివేయడంతో షర్మిల స్పృహ కోల్పోయిందని పోలీసులు తెలిపారు.
షర్మిల మరణించినట్లు నిర్ధారించుకున్న నిందితుడు, తన నేరాన్ని ప్రమాదంలా చూపించేందుకు పథకం వేశాడు. బెడ్‌రూమ్‌లోని పరుపుపై ఆమె బట్టలు, ఇతర వస్తువులు వేసి నిప్పు పెట్టాడు. దీంతో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగినట్టుగా కనిపించే పరిస్థితిని సృష్టించాడు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. పోస్ట్‌మార్టం నివేదిక, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) పరీక్షలే ఈ కేసులో కీలకంగా మారాయి. అగ్నిప్రమాదం జరిగిన తీరుకు, శరీరంపై ఉన్న గాయాలకు పొంతన లేకపోవడంతో పోలీసుల అనుమానం బలపడింది. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) (హత్య), 64(2), 66, అలాగే 238 (సాక్ష్యాల ధ్వంసం) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.