అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BCCI | టీమిండియా వన్డే భవిష్యత్తు, ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పాత్రపై నిర్ణయాత్మక చర్చలు జరగబోతున్నాయి. డిసెంబర్ 6 తర్వాత బీసీసీఐ (BCCI) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఇందులో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Coach Gautam Gambhir), చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొననున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన వివరాల ప్రకారం.. 2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) వరకు రోహిత్, విరాట్ (Virat Kohli) జట్టులో ఉండే పాత్ర ఏమిటి? వారిని బోర్డు ఎలా ఉపయోగించుకోవాలనుకుంటోంది? అనే అంశాలపై స్పష్టత తీసుకురావడమే ఈ మీటింగ్ లక్ష్యం.
BCCI | ఎక్కడ, ఎప్పుడు సమావేశం?
డిసెంబర్ 6న విశాఖపట్నంలో భారత్–దక్షిణాఫ్రికా (South Africa) వన్డే సిరీస్ చివరి మ్యాచ్ ముగిసిన వెంటనే చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీటింగ్ విశాఖపట్నం లేదా అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. బోర్డు రోహిత్–విరాట్‌లను ఈ విషయాలపై నివేదిక ఇవ్వాలని కోరబోతోంది. దీర్ఘకాలిక ఫిట్‌నెస్ ప్లాన్, ఫామ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్, అవసరమైతే దేశీయ క్రికెట్లో (సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ) ఆడమనే సూచన చేయనుంది. ఇద్దరూ ఇప్పటికే టెస్ట్, టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. కాబట్టి వారి భవిష్యత్తు దిశలో స్పష్టత తీసుకురావాలని బోర్డు భావిస్తోంది.
బోర్డు సంబంధిత అధికారులు మాట్లాడుతూ… రోహిత్ (Rohit Sharma), విరాట్ వంటి ఆటగాళ్లు ముందున్న లక్ష్యాలపై స్పష్టత కలిగి ఉండాలి. ప్రస్తుత టీమ్ మేనేజ్‌మెంట్ ఏమి ఆశిస్తున్నదో, జట్టు స్ట్రాటజీ ఏమిటో తెలియాలి అని అన్నారు. ఇక రోహిత్‌పై బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అతని ఫిట్‌నెస్ మెరుగు పరచాలి, భవిష్యత్తు గురించి పబ్లిక్ స్టేట్‌మెంట్స్ ఇవ్వవద్దు అని కూడా సూచించింది. రోహిత్ దూకుడు బ్యాటింగ్ కొనసాగించాలని బోర్డ్ సూచించినట్టు సమాచారం. ఆస్ట్రేలియా పిచ్‌లలో అతను జాగ్రత్తగా ఆడినట్లు కనిపించిందని, యువ బ్యాట్స్‌మన్‌లపై ఒత్తిడి తగ్గించడానికి రోహిత్–విరాట్ టాప్ ఆర్డర్‌ను నడిపించాలి అని సూచించారు. ఇక ఇదిలా ఉంటే టీమిండియా (Team India) బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్.. రోహిత్, విరాట్ 2027 వరల్డ్ కప్ వరకు ఆడే అవకాశాన్ని కొట్టిపారేయలేదు. వారి శరీరం అనుమతిస్తే, మానసికంగా బలంగా ఉంటే 2027 వరల్డ్ కప్ ఆడటం కష్టం కాదు అని అన్నారు.
