అక్షరటుడే, బాన్సువాడ: Banswada mandal | బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామానికి చెందిన మంగళి రఘు పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా (PhD doctorate degree) అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) చరిత్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ పారిటీ పర్యవేక్షణలో ‘కొత్తగా ఏర్పడిన తెలంగాణలో తీర్థయాత్ర పర్యాటకం – తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మరియు తరువాత తులనాత్మక అధ్యయనం’ అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేశారు. దీనిని పరిశీలించిన విశ్వవిద్యాలయ అధికారులు రఘుకు డాక్టరేట్ పట్టాను అందజేశారు.
గ్రామీణ పరిస్థితుల్లో పెరిగిన రఘు, కోనాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి పూర్తి చేసి, బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. ఓయూ పీజీ కాలేజీ నుంచి పీజీ పూర్తి చేసి, రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పరిశోధనకు ప్రవేశం పొందారు. తన పరిశోధనలో భాగంగా రఘు ప్రచురించిన పలు పరిశోధనా పత్రాలు వివిధ ప్రసిద్ధ జర్నల్స్‌లో రావడం విశేషం. ప్రస్తుతం గాంధారి మండలంలోని గండివేట్ తండాలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. డాక్టరేట్ పొందిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గురువులు, గైడ్ అరుణ పారిటీ, కుటుంబ సభ్యులు, మిత్రులు, సహోద్యోగులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
