అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | పాతబస్తీకి మణిహారంగా చారిత్రక చెరువు బమృక్‌నుద్దౌలా నిలుస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) అన్నారు. ఆక్రమణలతో ఆనవాళ్లను కోల్పోయిన ఈ చెరువు హైడ్రా పునరుద్ధరిస్తోంది. దీంతో చెరువు పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.
ప్రస్తుతం చెరువు వద్ద పనులు కొనసాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ మంగళవారం చెరువు పనులను పరిశీలించారు. చుట్టూ బండ్‌తో పాటు.. ఇన్‌లెట్లు, ఔట్ లెట్ల నిర్మాణాన్ని తనిఖీ చేశారు. చెరువుకు మూడు వైపులా నిర్మిస్తున్న ప్రవేశ మార్గాలను పరిశీలించారు. స్థానికంగా ఉన్నవారు సులభంగా చెరువు చెంతకు చేరేలా చూడాలని సూచించారు. నిజాంల కాలంలో ఈ చెరువుకు ఎంతో చరిత్ర ఉందని.. దానిని పునరావృతం చేసేలా.. చుట్టూ ఔషధగుణాలున్న మొక్కలతో పాటు.. చల్లటి నీడనిచ్చే చెట్లను నాటాలన్నారు. అన్ని వయసుల వారూ సులభంగా నడిచేలా వాకింగ్ ట్రాక్ (Walking Track)లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లైటింగ్ చెరువు చుట్టూ ఉండేలా చూడాలన్నారు. పిల్లల కోసం ప్లే ఏరియాలు, వృద్ధుల కోసం సీటింగ్ జోన్లు, ఓపెన్ జిమ్‌లు, పార్కులు వంటి సౌకర్యాలు త్వరగా పూర్తి చేయాలన్నారు.
Hydraa | 18 ఎకరాల్లో..
వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెరువును జాతి సంపదగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. చెరువు ఆక్రమణలను గత ఏడాది ఆగస్టు నెలలో తొలగించినట్టు చెప్పారు. 4.12 ఎకరాలుగా మిగిలిపోయిన ఈ చెరువు ఆక్రమణలను తొలగించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంతో 18 ఎకరాల మేర విస్తరించామన్నారు. వరద కట్టడితోపాటు.. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేలా చెరువును తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మరో 15 రోజుల్లో చెరువును ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
