అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB | రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. ఏ శాఖలో చూసినా అవినీతి అధికారులు ఉన్నారు. ఆయా కార్యాలయాలకు పనుల కోసం వెళ్లే ప్రజలను లంచాల కోసం వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
ప్రతి ఏటా డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం (International Anti-Corruption Day) నిర్వహిస్తారు. దీనిని పురస్కరించుకొని ఏసీబీ అధికారులు (ACB Officers) ఈ నెల 3 నుంచి 9 వరకు అవినీతి నిరోధక వారంగా పాటిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అవినీతి పోవాలి.. పారదర్శకత రావాలని పోస్టర్లు విడుదల చేస్తున్నారు. లంచం ఇవ్వడం షార్ట్‌కట్ కాదని నేరమని పేర్కొంటున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు (District Collectors) అవినీతి వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి పోస్టర్లు ఆవిష్కరిస్తున్నారు.
ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. పోస్టర్లో ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చని చెబుతున్నారు. నిజమైన హీరోలు లంచం ఇవ్వరని ఏసీబీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో ఏసీబీపై అవగాహన పెరిగింది. దీంతో అనేక మంది అవినీతి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా దొరుకుతున్నారు. మరింత అవగాహన పెరిగితే లంచం తీసుకోవాలంటే అధికారులు భయపడే రోజులు వస్తాయి.
