అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Artificial Intelligence | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం ప్రతీ రంగంలో వేగంగా పెరుగుతోన్న ఈ రోజుల్లో, అది ఉద్యోగాలను ఎలా ప్రభావితం చేస్తోందో తెలిపే సంఘటన తాజాగా ఆస్ట్రేలియాలో (Australia) చోటు చేసుకుంది.
63 ఏళ్ల క్యాథరిన్ సుల్లీవన్, 25 ఏళ్లుగా సేవలందించిన కామన్ వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియాలో (Commonwealth Bank of Australia) ఉద్యోగాన్ని కోల్పోయింది. ఆశ్చర్యకరంగా ఆమె ఉద్యోగం పోవడానికి కారణం ఆమె ట్రైన్ చేసిన ఏఐ వ్యవస్థ కావడం చర్చనీయాంశమైంది. ఉత్పాదకత పెంచడం, ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఆ బ్యాంక్ ఇటీవల ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ట్రైనింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. క్యాథరిన్ సహా మరికొంతమంది సీనియర్ ఉద్యోగులను ఏఐ ట్రైనింగ్ టీమ్‌లో (AI Training Team) చేర్చారు. ఏఐ మిషన్‌లు బ్యాంకింగ్ కార్యకలాపాలను అర్థం చేసుకోవడంలో సహాయపడే విధంగా వారికి శిక్షణ ఇచ్చారు.
Artificial Intelligence | ఉద్యోగం పోయిన వారిలో క్యాథరిన్ కూడా..
ఒకానొక దశలో, జులై 2025లో, బ్యాంక్ కొత్తగా ట్రైనింగ్ పొందిన ఏఐ వ్యవస్థను అధికారికంగా ప్రవేశపెట్టింది. కొన్ని వారాల వ్యవధిలోనే, బ్యాంక్ 44 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించే నిర్ణయం తీసుకుంది. బాధాకరంగా, క్యాథరిన్ కూడా ఆ లిస్ట్‌లో ఉండడం ఆమెను మానసికంగా కలిచివేసింది. ఈ ఘటనపై స్పందించిన క్యాథరిన్ భావోద్వేగంతో మాట్లాడుతూ.. “నేను ఆ బ్యాంకులో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఏఐ (Artificial Intelligence) వల్ల భవిష్యత్తులో మార్పులు వస్తాయని తెలిసినా.. నేనే ట్రైన్ చేసిన ఏఐ నా ఉద్యోగం పోయేలా చేయడం ఆందోళనకి గురిచేసింది. ఉద్యోగాలు పోవడం ఈ రోజుల్లో సహజం అయ్యింది. కానీ.. మనుషుల్ని తొలగించి, మిషన్‌లను పెట్టే ప్రక్రియకు కొంత నియంత్రణ ఉండాలి. కొన్ని నియమ నిబంధనలు అవసరం” అని అన్నారు.
ఈ ఘటన ఇప్పుడు గ్లోబల్ టెక్ (Global Tech) మరియు కార్పొరేట్ ప్రపంచంలో ఏఐ వాడకంపై నైతిక ప్రశ్నలు, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. కేవలం ఆర్థిక లాభాల కోసం మానవ వనరులను విస్మరించడమేనా కార్పొరేట్ వ్యూహం? ఉద్యోగులకు మార్గనిర్దేశం, రీప్లేస్‌మెంట్ గైడ్లైన్లు ఉండాలా? అన్న చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇది ఒక హెచ్చరికగానే కాకుండా, భవిష్యత్తు ఉద్యోగ విధానాలపై పునరాలోచనకు ఒక అవకాశం అన్న భావన అంతర్జాతీయంగా వ్యక్తమవుతోంది.