అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | భార్యపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిందని ఎస్పీ రాజేష్ చంద్ర (Sp Rajesh Chandra) తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. గాంధారి మండలం మర్లకుంట తండాకు చెందిన బాదావత్ స్వాతిని మాచారెడ్డికి (Machareddy) చెందిన విస్లావత్ లచ్చిరాంతో వివాహం జరిపించారు. వీరికి ఒక కూతురు ఉంది. తాగుడుకు బానిసైన లచ్చిరాం స్వాతిని అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించేవాడు.
ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకపోవడంతో తన కూతురిని తండ్రి ఇంటికి తీసుకెళ్లాడు. 2022 ఫిబ్రవరి 26న గాంధారికి టైలరింగ్ నిమిత్తం స్వాతి వెళ్లగా బైక్పై వచ్చిన లచ్చిరాం కత్తితో దాడి చేయగా ఆమె ఎడమ చేయికి గాయమైంది. ఈ విషయమై తండ్రి తేజానాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా లచ్చిరాంను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారించిన అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుమలత ముద్దాయికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్పీ తెలిపారు.