అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MP Arvind | కాంగ్రెస్ పాలనలో హిందు ఆలయాలపై దాడులు పెరిగాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) ఆరోపించారు. హిందూ సమాజంపై దాడులను సహించేది లేదన్నారు.
హైదరాబాద్ నగరంలోని పలు ఆలయాలపై ఇటీవల దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఎంపీ అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్ అని సీఎం రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) చెప్పారన్నారు. దీంతోనే దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. ఈ మాటలతో హిందూ సమాజంలో భయం పుట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం (Congress and MIM) కలిసి హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
MP Arvind | ఓల్డ్ సిటీలో..
హైదరాబాద్ నగరంలోని (Hyderabad City) పాతబస్తీలో ఆలయాలపై దాడులు పెరిగాయని ఎంపీ అర్వింద్ అన్నారు. ఓల్డ్ సిటీ నుంచి హిందువులను తరిమేసే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. దాడులు జరిగినా హిందువులనే అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక.. సంతోష్ నగర్‌లోని భూలక్ష్మీ మాత ఆలయం, శంషాబాద్‌లోని ముత్యాలమ్మ, హనుమాన్ ఆలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇటీవల సఫీల్‌గూడ కట్టమైసమ్మ, పురాణపూల్ మైసమ్మ గుడులపై దాడులకు పాల్పడ్డారని చెప్పారు. ఇంకా అనేక ఘటనలు జరిగాయని ఆయన తెలిపారు. వీటికి నైతిక బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డిదే అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని బలిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
MP Arvind | ఇందూరుగా మారుస్తాం..
నిజామాబాద్ పేరు ఇందూరుగా మారుస్తామని ఎంపీ మరోసారి వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ నిర్ణయం కాదన్నారు. చారిత్రక న్యాయమని స్పష్టం చేశారు. బ్రిటిష్ కాలం రైల్వే మ్యాప్స్‌లో కూడా ఇందూరు అనే ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్ సైతం ఇదే చెబుతుందన్నారు. ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్లో తమ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొదటి తీర్మానం నగరం పేరు మార్పుపైనే ఉంటుందన్నారు.