అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ashika Ranganath | కన్నడ నటి ఆషికా రంగనాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మేనమామ కూతురు అచల్ (22) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అందరూ షాక్‌లో ఉన్నారు.
నవంబర్ 22న ఘటన జరగగా.. పది రోజులైనప్పటికీ పోలీసులు ఇంకా చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హసన్‌కు చెందిన అచల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల కోసం ఇటీవలే బెంగళూరుకు (Bangalore) వచ్చింది. దూరపు బంధువు మయాంక్‌తో అచల్ కొంతకాలంగా ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మయాంక్, ఆమెపై లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చాడన్నారు. తిరస్కరించడంతో శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Ashika Ranganath | మనస్థాపంతో..
డ్రగ్స్‌కు బానిస అయిన మయాంక్ మరికొందరు యువతులతో సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకున్న అచల్ తీవ్ర మనస్తాపానికి గురైందట. ఈ నేపథ్యంలో పాండురంగ నగర్‌లోని (Panduranga Nagar) బంధువుల ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే అచల్ ఆత్మహత్య చేసుకున్న ఇల్లు ఆషికా రంగనాథ్ నివాసమని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయం బయటపడితే ఆషికాకు సమస్యలు రావచ్చని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించినట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు మయాంక్‌కు అచల్ పంపిన చివరి మెసేజ్ విచారణలో బయటపడింది. “నువ్వు లేకుండా నేను జీవించలేను. నువ్వు నన్ను మోసం చేసినప్పటికీ మర్చిపోలేను.. నువ్వు చేసిన ద్రోహానికి మూల్యం చెల్లించుకోవాలి” అంటూ ఆమె రాసినట్లు తెలుస్తోంది.
అచల్ తల్లిదండ్రులు మయాంక్‌తో పాటు అతడి తల్లిపై కూడా కేసు నమోదు చేయగా.. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇక ఆషికా రంగనాథ్ విషయానికి వస్తే తెలుగులో అమిగోస్, నా సామి రంగ చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చిరంజీవి విశ్వంభరలో కీలక పాత్ర పోషిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో మూవీ విడుదల కానుంది. అలాగే రవితేజ నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
