అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bhatti Vikramarka | నైనీ కోల్ మైన్స్ (Naini Coal Mines), సింగరేణి (Singareni)పై వస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడారు.
సింగరేణిపై కొన్ని రోజులుగా కొన్ని కట్టుకథలు, రాతలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రకరకాలుగా తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై కావాలని తప్పుడు కథనాలు రాస్తున్నారని పేర్కొన్నారు. దోపిడీదారుల ప్రయోజనాల కోసం ఈ కథనాలు వస్తున్నట్లు కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిపలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని ఏబీఎన్ రాధాకృష్ణ (ABN Radhakrishna)ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bhatti Vikramarka | నిజాలు బయటకు రావాలి
సింగరేణి టెండర్ల విషయంలో నిజాలు బయటకు రావాలని భట్టి అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్పారు. అడ్డగోలు ప్రచారం చేసే వారి అసలు రూపం బయటపడాలన్నారు. పత్రికలు, నాయకులే కాదు, సోషల్ మీడియా (Social Media)లో కూడా ఇష్టమొచ్చినట్టుగా రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ వాస్తవాలు తెలియజేసేందుకు డాక్యుమెంట్లు ఇస్తామన్నారు. 2018లోనే టెండర్ డాక్యుమెంట్ కోల్ ఇండియా తయారుచేసి పంపించిందని ఆయన పేర్కొన్నారు. సైట్ విజిట్ తప్పనిసరి అని కోల్ ఇండియానే పెట్టిందన్నారు. టెండర్ డాక్యుమెంట్లు వచ్చినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉందన్నారు.
Bhatti Vikramarka | విచారణకు సిద్ధం
సింగరేణి టెండర్లపై హరీశ్‌రావు (Harish Rao) లేఖ రాయడం, కిషన్‌రెడ్డి (Kishan Reddy) విచారణ చేస్తామనడం మంచిదే అని భట్టి విక్రమార్క అన్నారు. అందరి నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు. 2021లో సెంట్రల్ మైనింగ్ కూడా సైట్ విజిట్ తప్పనిసరి అని చెప్పిందని గుర్తు చేశారు. రైల్వే శాఖ (Railway Department)లో కూడా టెండర్ వేసే కంపెనీ సైట్ విజిట్ తప్పనిసరి అని నిబంధన ఉందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన టెండర్లపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. పత్రికల్లో అడ్డగోలుగా ఏదిపడితే అది రాస్తే నడవదని ఆయన హెచ్చరించారు. తాను ఆస్తులు సంపాదించుకునేందుకు రాలేదన్నారు. సింగరేణిపై ఏ గద్దని, ఏ పెద్దలను వాలనీయనని స్పష్టం చేశారు.