అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ratha Saptami | తిరుమలలో (Tirumala) రథ సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25న రథ సప్తమి ఉండడంతో ఏర్పాట్లపై బుధవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ (TTD EO Anil Kumar Singhal) అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రథ సప్తమి సందర్భంగా తిరుమలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు. శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులు, క్యూలైన్లు, బయట ప్రాంతాల్లో నిరంతరాయంగా భక్తులకు అన్న ప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల భద్రతకు పెద్ద పీట వేయాలని, టీటీడీ భద్రత విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వంయంతో పని చేయాలని ఆదేశించారు.
Ratha Saptami | అదనంగా లడ్డూలు
రథ సప్తమి నాడు భక్తులకు ఇబ్బంది కలగకుండా అదనంగా 5 లక్షల లడ్డూలను సిద్ధం చేయాలని ఈవో సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. భక్తుల వాహనాల పార్కింగ్ కోసం సరైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్యాలరీల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్యాలరీలను శుభ్రంగా ఉంచాలని ఆయన సూచించారు. భక్తులకు వైద్య సేవలు (Medical Services) అందించేందుకు వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
Ratha Saptami | స్వామివారికి నిర్వహించనున్న వాహన సేవలివే..
రథ సప్తమి రోజు స్వామి వారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై (Suryaprabha Vahanam) మాఢ వీధుల్లో విహరిస్తారు. 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై, 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనంపై స్వామి వారు దర్శనం ఇస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై ఊరేగుతారు. 2–3 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 –5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామి వారు దర్శనమిస్తారు.
Ratha Saptami | ఆర్జిత సేవలు రద్దు
రథ సప్తమి సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు సైతం ఆ రోజు నిలిపి వేయనున్నారు. జనవరి 24 నుంచి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయరు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు (VIP Break Darshan) రద్దు చేస్తారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని అధికారులు తెలిపారు.