అక్షరటుడే, కామారెడ్డి : Arogya Sri | రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు (Arogya Sri services) నిలిచిపోయాయి. పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల నెట్వర్క్ అసోసియేషన్ సేవలు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 28 ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ నెట్వర్క్లో ఉన్నాయి. బుధవారం నుంచి ఆయా ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు అందడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం (Rajiv Arogya Sri schem) ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొనసాగిస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లో ఉన్న విభాగాల ఆధారంగా వాటి పరిధిలో ఉండే సేవలను ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 25 ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతుండగా కామారెడ్డి జిల్లాలో శ్రీ మెడికేర్, లైఫ్ హాస్పిటల్, మ్యాటిక్స్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. అయితే బిల్లుల విడుదలలో జాప్యం నేపథ్యంలో రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు ఆయా హాస్పిటల్స్లో సేవలను నిలిపివేశారు.
Arogya Sri | బిల్లులు రాక ఇబ్బందులు
ప్రైవేట్ ఆస్పత్రుల్లో (Private hospitals) ఆరోగ్య శ్రీ కింద వివిధ రకాల వైద్య సేవలను అందిస్తున్నారు. వాటి కోసం ప్రత్యేకంగా వార్డులు కేటాయించి, ప్రత్యేక మిషనరీస్ కూడా ఏర్పాటు చేశారు. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, న్యూరాలజీ, ఆర్థో లాంటి ముఖ్యమైన విభాగాల్లో వందలాది మంది రోగులు ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందుతున్నారు. అయితే ఆయా చికిత్సకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రావడం లేదు. రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) 25 ఆస్పత్రులకు దాదాపుగా రూ.21 కోట్లు, కామారెడ్డి జిల్లాలోని (Kamareddy district) ఆస్పత్రులకు దాదాపు రూ.3 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆస్పత్రుల నిర్వాహణ భారంగా మారిందని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బిల్లుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి సేవలు నిలిపివేశాయి.
Arogya Sri | డయాలసిస్ రోగులకు మినహాయింపు
ఉమ్మడి జిల్లాల్లోని నెట్వర్క్ ఆస్పత్రుల్లో (network hospitals) ఆరోగ్య శ్రీ కింద సేవలన్ని నిలిచిపోయాయి. అయితే కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ప్రతిరోజు డయాలసిస్ చేసుకునే వారికి మాత్రం మినహాయించారు. డయాలసిస్ చేయకపోతే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతారు. దీంతో వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్పత్రులు వారికి మాత్రం సేవలను నిలిపి వేయలేదు.
Arogya Sri | పెరగనున్న రద్దీ
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలు చేపట్టి సేవలు ప్రారంభించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే ప్రభుత్వ ఆస్పత్రులకు (government hospitals) రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీజనల్ వ్యాధుల బారిన పడిన ప్రజలు చికిత్స పొందుతున్నారు. నిత్యం ప్రమాదాలు, ఇతరత్రా కారణాలతో వేలాదిగా ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తున్నారు. ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభం కాకపోతే ఆయా చికిత్సల కోసం సైతం ప్రజలు సర్కార్ దవాఖానాలకు రానున్నారు. దీంతో రద్దీ పెరిగి రోగులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.