అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Army Chief Dwivedi | ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. దాడులకు దిగితే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు.భారత్‌లో భారీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు ఇటీవల జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఆడియో విడుదలైన విషయం తెలిసిందే.
భారత్‌లో దాడి చేయడానికి అనేక మంది సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారని ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో (Jammu and Kashmir) పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.
Army Chief Dwivedi | సిద్ధంగా ఉన్నాం
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి ప్రయత్నించినట్లయితే, సాయుధ దళాలు భూ కార్యకలాపాలను ప్రారంభించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ జరిగిన 88 గంటల్లో సంప్రదాయ స్థలాన్ని విస్తరించడానికి సైన్యం సమీకరణ ఎంతగా ఉందో మీరు చూశారన్నారు. పాకిస్థాన్ (Pakistan) ఏదైనా తప్పు చేస్తే తాము భూ కార్యకలాపాలను ప్రారంభించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం ప్రతిస్పందన క్షేత్ర స్థాయిలో భిన్నమైన వాస్తవికతను ప్రదర్శించిందని అన్నారు.
Army Chief Dwivedi | జమ్మూకశ్మీర్‌లో..
జమ్మూ కశ్మీర్ వెంబడి పరిస్థితి సున్నితంగా ఉన్నప్పటికీ, అది పూర్తిగా నియంత్రణలో ఉందని ఆర్మీ చీఫ్ తెలిపారు. 2025లో 31 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు. వీరిలో 65 శాతం మంది పాకిస్థాన్‌కు చెందిన వారన్నారు. ఆపరేషన్ మహాదేవ్‌లో హతమైన పహల్గామ్ దాడి (Pahalgam Attack)కి పాల్పడిన ముగ్గురు కూడా వీరిలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం క్రియాశీల స్థానిక ఉగ్రవాదుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు పడిపోయిందని, ఉగ్రవాదుల రిక్రూట్మెంట్లు దాదాపుగా లేవని చెప్పారు. పీవోకేలో దాదాపు ఎనిమిది శిబిరాలు ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. వాటిపై నిశితంగా నిఘా ఉంచామని వెల్లడించారు.
Army Chief Dwivedi | 100 మంది మృతి
ఆపరేషన్ సిందూర్ సమయంలో 100 పాకిస్థాన్ సిబ్బంది చనిపోయినట్లు ద్వివేది తెలిపారు. కాగా గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్ మే 7న పాక్‌పై దాడులు చేసింది. పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. అనంతరం పాక్ డ్రోన్లు, క్షిపణులతో భారత్‌పై దాడులు చేయగా.. భారత గగనతల రక్షణ వ్యవస్థ వాటిని అడ్డుకుంది. అనంతరం పాక్‌లోని పలు ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడులు చేపట్టింది. ఈ క్రమంలో మే 10న పాక్ కాల్పుల విరమణకు ప్రతిపాదించింది. దీంతో రెండు దేశాలు సీజ్‌ఫైర్‌కు అంగీకరించాయి.