అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | బీసీ రిజర్వేషన్లపై విచారణలు కొనసాగుతున్నాయి. రిజర్వేనషన్లకు వ్యతిరేకంగా పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. ఆయనతో పాటు పలువురు ఇంప్లిడ్ పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే రిజర్వేషన్లకు మద్దతుగా కూడా ఆర్ కృష్ణయ్య, ఇతరులు పిటిషన్లు వేశారు. మొత్తం ఆరు పిటిషన్లపై హైకోర్టు బుధవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభించింది.
BC Reservations | సుదీర్ఘంగా విచారణ
మధ్యాహ్నం 12 గంటల నుంచి హైకోర్టులో విచారణ సాగింది. మొదట పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50శాతం రిజర్వేషన్లు దాటొద్దని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన జీవో ప్రకారం 67 శాతానికి రిజర్వేషన్లు పెరిగాయి. బీసీలకు 42, ఎస్సీ ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. లంచ్ బ్రేక్ అనంతరం సైతం విచారణ కొనసాగుతోంది. గవర్నర్ (Governor) దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉండగా జీవో తీసుకొచ్చారని పిటిషనర్లు వాదించారు.
ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్ అమలు చేస్తోందని పేర్కొన్నారు. ట్రిపుల్ టెస్ట్ (Triple Test)ను పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవని కోర్టు దృష్టికి తెచ్చారు. తమకు స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలనే ఉద్దేశం లేదని, చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఉండాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. అయితే రిజర్వేషన్ల పరిమితి 50 శాతం మించితే.. ఎన్నికలు రద్దవుతాయని సుప్రీంకోర్టు (Supreme Court) నిబంధన ఉందని పిటిషనర్ తరఫు లాయర్ గుర్తు చేశారు.
BC Reservations | న్యాయం చేయడం కోసమే..
కుల గణన (Caste Census) ద్వారా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ పెంచినట్లు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్‌తో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం చేయటం సాధ్యం అవుతుందని కోర్టుకు తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉందని సింఘ్వి వాదించారు. మొదట పిటిషనర్ తరఫు లాయర్లు వాదించగా.. లంచ్ బ్రేక్ తర్వాత ప్రభుత్వం తరఫున వాదనలు ప్రారంభం అయ్యాయి. సింఘ్వి వాదిస్తూ.. రిజర్వేషన్ల బిల్లును అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని కోర్టుకు తెలిపారు. జీవోపై స్టే ఇవ్వాలని కోరడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కోర్టు ఇదే చివరి విచారణ కాదని పేర్కొంది. అన్ని అంశాలను ఇప్పుడే ప్రస్తావించొద్దని సూచించింది.