అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maoists Surrender | మావోయిస్ట్‌లకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) దంతెవాడ జిల్లాలో శుక్రవారం ఏకంగా 63 మంది మావోయిస్టులు లొంగిపోయారు (Maoists surrendered).
లొంగిపోయిన మావోయిస్టుల్లో 36 మందిపై రూ.1.19 కోట్లకు పైగా రివార్డు ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ‘పూనా మార్గెం’ కార్యక్రమం కింద వీరు ఆయుధాలు వీడారు. లొంగిపోయిన వారిలో 18 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. సీనియర్ పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) అధికారుల ముందు లొంగిపోయారని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ (Dantewada SP Gaurav Rai) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానం తమను ఆకట్టుకుందని మావోయిస్టులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
Maoists Surrender | కొనసాగుతున్న లొంగు‘బాట’
ఆపరేషన్ కగార్ ధాటికి మావోయిస్ట్ పార్టీ (Maoist party) దాదాపుగా తుడిచి పెట్టుకుపోయింది. కీలక నేతలు సహా వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. దీంతో మిగతా వారు లొంగుబాట పట్టారు. తాజాగా లొంగిపోయిన వారు దక్షిణ బస్తర్ డివిజన్, పశ్చిమ బస్తర్ డివిజన్, మాడ్ డివిజన్, ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో చురుకుగా ఉన్నారని ఎస్పీ చెప్పారు.
Maoists Surrender | లొంగిపోయింది వీరే..
మావోయిస్టుల కలహండి ఏరియా కమిటీ కార్యదర్శి పక్లు అలియాస్ ప్రదీప్ ఓయం, డివిజనల్ కమిటీ సభ్యుడు మోహన్ అలియాస్ ఆజాద్ కడ్తి (32), అతని భార్య సుమిత్ర అలియాస్ ద్రౌపది చపా (30), హుంగి అలియాస్ రాధిక లేకమ్ (28), సుఖ్రామ్ టాటి (20), పాండు మడ్కమ్ (19), సోమ్డు కడ్తి (21) తదితరులు జన జీవన స్రవంతిలో కలిశారు. వీరిలో ఏడుగురు క్యాడర్లపై ఒక్కొక్కరిపై రూ.5 లక్షలు, 8 మందిపై ఒక్కొక్కరిపై రూ.2 లక్షలు, 11 మందిపై ఒక్కొక్కరిపై రూ. లక్ష మరియు ముగ్గురిపై రూ.50 వేల చొప్పున రివార్డు ఉందని ఎస్పీ వెల్లడించారు. 63 మంది మావోయిస్టులందరికీ తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.50వేలు అందజేశారు. ప్రభుత్వ విధానం ప్రకారం వారికి తదుపరి పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు.