అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో వరుస కుంభకోణాలు వెలుగులోకి వస్తుండటం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల తిరుమల పరకామణిలో జరిగిన దొంగతనం కేసు, శ్రీవారి ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి (Adulterated Ghee) వాడిన స్కామ్ బయటపడిన నేపథ్యంలో, ఇప్పుడు మరో కీలక అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మల్బరీ పట్టు శాలువాల బదులు, పూర్తిగా పాలిస్టర్‌తో తయారైన నాసిరకం శాలువాలను టీటీడీకి TTD సరఫరా చేసినట్లు అధికారికంగా గుర్తించారు.
Tirumala | | మల్బరీ పట్టు బదులు పాలిస్టర్…
టీటీడీ ఆరోపణల ప్రకారం, నగరి ప్రాంతానికి చెందిన VRS Export of Nagari అనే సంస్థ 2015 నుంచి 2025 వరకు శ్రీవారి దర్శనానంతరం భక్తులకు అందించే పట్టు శాలువాలను సరఫరా చేస్తోంది. టెండర్ నిబంధనల్లో పేర్కొన్న ప్రమాణాల ప్రకారం 100% మల్బరీ సిల్క్ (Mulberry Silk)తో, ప్రత్యేక ప్రమాణాల్లో నూలుతో నేయాలి. ప్రతి శాలువాపై ‘ఓం నమో వేంకటేశాయ’ పదాలు, శంకు-చక్రం-నామం చిహ్నాలు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ ప్రమాణాలకు బదులుగా, పూర్తిగా పాలిస్టర్ మెటీరియల్‌తో రూపొందించిన నాసిరకం శాలువాలను సరఫరా చేశారని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Board Chairman BR Naidu) వెల్లడించారు. రూ. 350–400 విలువ చేసే శాలువాలను టీటీడీ నుండి ఏకంగా రూ.1,389 చొప్పున వసూలు చేసినట్లు ఆరోపించారు.
కొత్తగా వచ్చిన శాలువాల స్టాక్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు (TTD Vigilance Officers) సేకరించి ధర్మవరం, బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ లేబొరేటరీలకు పంపించారు. పరీక్షల్లో శాలువాలు పాలిస్టర్‌తోనే తయారైనట్లు స్పష్టమైన నివేదికలు వచ్చాయని టీటీడీ పేర్కొంది. శాలువాలపై పట్టు హోలోగ్రామ్ గత కొన్నేళ్లుగా లేకపోవడం కూడా అనుమానాలకు తావిచ్చింది. 2015–2025 మధ్య కాలంలో 15,000 శాలువాలకు మొత్తం రూ.54.95 కోట్లు చెల్లించినట్లు సమాచారం. గతంలో కాంచీపురం ల్యాబ్‌లో పరీక్షించినప్పుడు శాలువాలు సిల్క్‌గా తేలినట్లు టీటీడీ తీర్మానం పేర్కొంది. దీంతో అప్పటి అధికారులు నమూనాలను మార్చి ఉండవచ్చని లేదా ఉద్దేశపూర్వకంగా అవినీతికి పాల్పడి ఉండవచ్చని టీటీడీ అనుమానం వ్యక్తం చేసింది.