అక్షరటుడే, వెబ్డెస్క్ : Vidya Wires IPO | కేబుల్స్ తయారు చేసే విద్య వైర్స్ కంపెనీని 1981లో స్థాపించారు. ఇది రాగి మరియు అల్యూమినియం వైర్ల తయారీలో నిమగ్నమై ఉంది. ఈ కంపెనీ వివిధ పరిశ్రమల కోసం వైండింగ్ మరియు కండక్టివిటీ ఉత్పత్తులను తయారు చేస్తుంది.
ఇందులో ప్రెసిషన్ ఇంజినీరింగ్ వైర్లు (Precision Engineering Wires), కాపర్ స్ట్రిప్స్, కండక్టర్లు, బస్‌బార్లు, ప్రత్యేకమైన వైండిరగ్ వైర్లు (Special Winding Wires), పీవీ రిబ్బన్లు మరియు అల్యూమినియం పేపర్ కవర్డ్ స్ట్రిప్స్ ఉన్నాయి. వీటిని శక్తి ఉత్పత్తి, విద్యుత్ వ్యవస్థలు, విద్యుత్ చలనశీలత, రైల్వేలు మరియు క్లీన్ ఎనర్జీ వంటి కీలకమైన అనువర్తనాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 300.01 కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఇందులో రూ. 274 కోట్లు ఫ్రెష్ ఇష్యూ కాగా.. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్. ఐపీవో (IPO) ద్వారా వచ్చిన నిధులను అనుబంధ సంస్థ అయిన ఏఎల్‌సీయూలో కొత్త ప్రాజెక్టును స్థాపించడానికి మూలధన వ్యయ అవసరాలకు నిధులు సమకూర్చడం కోసం, కంపెనీ రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించడం కోసం, ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నారు.
ఆర్థిక పరిస్థితి..
2023 -24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 1,188.49 కోట్ల రెవెన్యూ ద్వారా రూ. 25.68 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రూ. 1,436.35 కోట్లకు, నికర లాభం రూ. 40.87 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికం చివరి నాటికి రూ. 413.09 కోట్ల ఆదాయం ద్వారా రూ. 12.06 కోట్ల నికర లాభాన్ని రికార్డు చేసినట్లు కంపెనీ తెలిపింది.
ప్రైస్ బ్యాండ్..
కంపెనీ ధరల శ్రేణిని రూ. 48 నుంచి రూ. 52 మధ్యలో నిర్ణయించింది. ఒక లాట్‌లో 288 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,976 తో బిడ్ వేయాల్సి ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 13 లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ ఒక్కో షేరుపై రూ. 6 ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 11.5 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు..
విద్యా వైర్స్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగుస్తుంది. 8వ తేదీ రాత్రి షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 10న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ కానున్నాయి.
