అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nellore District | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో బస్సు ప్రమాదాలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లకూరు మండలం (Pellakur Mandal) దొడ్లవారిమిట్ట సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus)లో ప్రమాద సమయంలో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కకు ఒరిగి బోల్తా పడటంతో కలకలం రేగింది.
Nellore District | విజయవాడ – బెంగళూరుకు రాకపోకలో ఆగని ప్రమాదాలు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనేక మంది ప్రయాణికులు, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ఆరోపించారు. ప్రమాదం వలన జాతీయ రహదారి (National Highway)పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి గంటల తరబడి శ్రమించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం .. బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేయడానికి ప్రత్యామ్నాయ వాహనాలను ఏర్పాటు చేసింది.
గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలలో బస్సు ప్రమాదాలు భయబ్రాంతులకి గురి చేస్తున్నాయి. ఈ ప్రమాదాల వలన చాలా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో బెంగళూరు హైవేపై జరిగిన వీ కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవదహనం కావడం, తెలంగాణలో చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. పెళ్లకూరు ప్రమాదంతో మరోసారి బస్సు ప్రయాణాలు సురక్షితమేనా అనే ప్రశ్నలు లెవనెత్తేలా చేస్తున్నాయి.
