అక్షరటుడే, ఆర్మూర్: Annapurna Mata Jathara | సిరికొండ మండలంలోని వాల్గోట్ గ్రామంలోని బోడగుట్టపై అన్నపూర్ణ మాత జాతరను (Annapurna Mata Jathara) ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు వాల్గోట్ గ్రామస్థులు ఏర్పాట్లు చేశారు.
అన్నపూర్ణ మాత కొలువైన ఆ గుట్టకు బోడగుట్ట అని పేరు. ఆ గుట్టపై 200ఏళ్ల క్రితం ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు అతడికి ఆ గుట్టపైన ఒక శివలింగంతో కూడిన ఆలయం కట్టాలని కలలో అమ్మవారు తెలిపారు. దీంతో ఆయన నాలుగు వైపుల గోడలతో పైకప్పు లేకుండా అన్నపూర్ణ, శంకరులను ప్రతిష్ఠించాడు. పైకి శిఖరం కనిపించని కారణం చేత దానికి బోడగుట్టగా (Bodagutta) పిలిచేవారు.
Annapurna Mata Jathara | 1967-68లో సుకందర స్వామి ఆధ్వర్యంలో..
1967-68లో సుకందర స్వామి గుడిలింగాపురంలో 12ఏళ్ల క్రితం తపస్సు చేశారు. పెద్ద వాల్గోట్ గ్రామస్థులైన కోరిక మేరకు సిద్ధి పొందిన సుకందర స్వామి వాల్గోట్ సిరికొండ క్రాస్ రోడ్డు వద్ద ఆశ్రమం స్థాపించేందుకు నిశ్చయించుకున్నారు. అయితే ఆయనకు ఒకరోజు అన్నపూర్ణ మాత స్వామికి కలలో బోడగుట్టపై ఆలయం ఉన్నట్టు పేర్కొన్నారు. దీంతో సుకందర స్వామి కొందరు భక్తులతో కలసి బోడగుట్టపైకి వెళ్లి అక్కడ భిన్నమైన అన్నపూర్ణ శంకరుల విగ్రహాలు శిధిలమైన ఆలయం ఉన్నట్టు గుర్తించారు. ఆ ఆలయాన్ని పునరుద్ధరించాలని సుకందరస్వామికి సంకల్పం కలిగింది. 1970లో పెద్దవాల్గోట్ పెద్దలను సంప్రదించి గుట్టపై అన్నపూర్ణదేవి మహత్యం గల గుడి ఉందని, ప్రతీ ఏడాది పుష్య బహుళ చతుర్దశి, అమావాస్య రెండు రోజులు అమ్మపేరు మీద జాతర చేయాలని, అమావాస్య 50-60 మందికి అయినా అన్నదానం చేయాలని స్వామి పేర్కొన్నారు.
Annapurna Mata Jathara | జాతర నిర్వహిస్తూ..
పెద్దవాల్గొట్ (Peddavalgot village), కొండూరు గ్రామాలతో పాటు పక్క గ్రామాల వారు సైతం అన్నపూర్ణ జాతర చేయడానికి నిర్ణయించుకుని ప్రతి ఏడాది అమావాస్య రోజు గుట్టపై యజ్ఞం చేస్తూ అన్నదానం నిర్వహిస్తున్నారు. తర్వాతి రోజుల్లో ఆలయానికి శిఖరం, మండపం కట్టించారు. అనంతరం అభివృద్ధి చెందుతూ వచ్చిన ఆలయంలో అమావాస్య రోజు దాదాపు పన్నెండు క్వింటాళ్ల బియ్యంతో అన్నదానం చేస్తూ జిల్లాలోనే ప్రత్యేకంగా అన్నపూర్ణ మాత జాతర నిలుస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
పెద్దవాల్గోట్ గ్రామంలో పుష్య బహుళ చతుర్దశి రోజున అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. అమ్మవారికి ఇంటింటికీ మంగళ హారతితో స్వాగతం పలికి ఎవరికి తోచినవి వారు సమర్పిస్తారు. సిరికొండ, ధర్పల్లి, భీమ్గల్, ఆర్మూర్, నిజామాబాద్ నుండి.. పక్కజిల్లాలైన కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల నుండి జనాలు తండోపతండాలుగా జాతరకు తరలి రావడం విశేషం.
Annapurna Mata Jathara | ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
అన్నపూర్ణేశ్వరీ జాతరకు ఆర్టీసీ సైతం స్పెషల్ బస్సులు నడపడం కూడా చెప్పుకోదగ్గ విషయం. అప్పట్లో ఆలయానికి సరైన దారి ఉండేది కాదు.. ప్రస్తుతం ఆలయాభివృద్ధి జరిగి.. రోడ్డు సౌకర్యం కూడా ఏర్పడింది. దీంతో భక్తుల రాకపోకలు సైతం పెరిగాయి.