అక్షరటుడే, వెబ్డెస్క్ : AP High Court | సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో కోడి పందేలు, జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు చేపట్టాలని హైకోర్టు (High Court) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పండుగ రోజుల్లో చట్టవిరుద్ధంగా జరిగే కోడి పందేలు, పేకాటలు, బెట్టింగ్‌లను పూర్తిగా అడ్డుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశించింది.
అవసరమైతే పరిస్థితిని బట్టి 144 సెక్షన్ అమలు చేయాలని కూడా కోర్టు సూచించింది. జంతు హింస నిరోధక చట్టం–1960, జూద నిరోధక చట్టం–1974లను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ అంశంపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాల నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని మండలాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేసి పండుగ రోజుల్లో నిరంతర నిఘా కొనసాగించాలని సూచించింది.
AP High Court | వాటికి చెక్…
ఇదే సమయంలో కోడి పందేలపై (CockFights) సంప్రదాయం పేరుతో జరుగుతున్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. సంక్రాంతి అంటే పిండి వంటలు, పండుగ సంబరాలతో పాటు కోడి పందేలూ గ్రామీణ సంస్కృతిలో భాగమనే వాదన కొందరిలో వినిపిస్తోంది. గతంలోనూ హైకోర్టు ఆంక్షలు విధించినా, వాటి అమలు ప్రతిసారీ సవాలుగానే మారింది. ఈసారి మాత్రం రాష్ట్ర రాజకీయ వర్గాల నుంచి కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. “సంక్రాంతి అంటే జూదం అనే భావన మారాలి” అంటూ ఆయన స్పష్టంగా పేర్కొనడం చర్చకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో సంక్రాంతి Pongal కోడి పందేలు ఒక పెద్ద ఈవెంట్‌లా మారిపోయాయి. పండుగ రోజుల్లో ఈ పోటీలను చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచే కాదు, విదేశాల్లో స్థిరపడిన వారు కూడా స్వగ్రామాలకు చేరుకుంటారు. కోడుల ఎంపిక, శిక్షణ, ప్రత్యేక ఆహారం, పోరాటానికి ముందు సన్నాహాలు—ఇవి అన్నీ చాలా వ్యవస్థీకృతంగా జరుగుతుండటం ఈ కార్యకలాపాల వెనుక ఉన్న భారీ స్థాయిని చూపుతోంది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు కోడి పందేల కేంద్రాలుగా గుర్తింపు పొందాయి.
ఒకప్పుడు పంట పండుగలో భాగంగా జరిగిన ఈ గ్రామీణ క్రీడ, ఇప్పుడు సంక్రాంతి నాలుగు రోజుల పాటు కోట్ల రూపాయల పందాలు జరిగే జూదంగా రూపాంతరం చెందిందనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా కోస్తా జిల్లాల్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ‘బారులు’గా పిలిచే పెద్ద వేదికలు భీమవరం, ఉండి, ఆకివీడు, సీసలి, యలమంచిలి, దుగ్గిరాల, మురముళ్ల వంటి ప్రాంతాల్లో సిద్ధమవుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా జిల్లాలకే పరిమితమైన కోడి పందేలు, ఇప్పుడు కాకినాడ, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనకాపల్లి జిల్లాల వరకూ విస్తరిస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.