అక్షరటుడే, వెబ్‌డెస్క్ : AP Government | ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సమాఖ్య సహాయకులుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ప్రభుత్వ కాలంలో విధించిన మూడు ఏళ్ల కాలపరిమితిని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.
ఈ మేరకు సెర్ప్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వీవోఏలు ఇకపై నిరంతర సేవలను కొనసాగించే అవకాశం లభించింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం, వీవోఏల నియామకం, తొలగింపు బాధ్యతలు ఇకపై మండల స్థాయి అధికారి (APM) వద్ద కాకుండా జిల్లా పీడీ (ప్రాజెక్ట్ డైరెక్టర్) ఆధీనంలోకి మార్చబడ్డాయి. అవినీతి లేదా అక్రమాలకు పాల్పడిన వీవోఏలపై పీడీ నేరుగా చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంటారు. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయగలరు.
AP Government | ఫుల్ ఖుష్..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27,000 మంది వీవోఏ(VOA)లు సేవలు అందిస్తున్నారు. వీరి సేవా భద్రతపై నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితి ఈ ఉత్తర్వులతో తొలగిపోయింది. ఈ నిర్ణయాన్ని సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Minister Srinivas) మరియు వాకాటి కరుణ వీవోఏల సంఘ ప్రతినిధులకు సచివాలయంలో అందజేశారు. వీవోఏల ప్రతినిధులు మంత్రి శ్రీనివాస్‌ను కలిసి తమ సమస్యలను వివరించగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో వీవోఏల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరవేయడంలో వీరి భాగస్వామ్యం కీలకమని తెలిపారు.
అదనంగా, రాబోయే రెండు నెలల్లో వీవోఏలకు 5G ఆండ్రాయిడ్ ఫోన్లు అందజేస్తామని మంత్రి ప్రకటించారు. దీంతో వారు తమ పనులను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించగలరని ఆయన చెప్పారు. ఈ నిర్ణయంతో వీవోఏలలో ఆనందం నెలకొంది. ఉద్యోగ భద్రతపై నెలలుగా కొనసాగిన ఆందోళనకు తెరపడిందని, కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తమకు పెద్ద ఊరట అని వారు పేర్కొన్నారు. మరోవైపు, పెన్షనర్లకు అదనపు పెన్షన్ ఆటోమెటిక్‌గా అందేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం(AP Government) ఆదేశించింది. సంబంధిత వినతిని సీఎం కార్యాలయం ఆర్థిక శాఖకు పంపి, నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో రూ.2,500 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు అమలు కానున్నాయి. ఇక మెగా డీఎస్సీ లో ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులు, నియామక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం మీద, వీవోఏలు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలందరికీ ప్రభుత్వం వరుసగా శుభవార్తలు అందిస్తూ, పరిపాలన వేగాన్ని పెంచింది.