అక్షరటుడే, వెబ్డెస్క్ : Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పింఛన్ల పంపిణీలో గత ప్రభుత్వ కాలంలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం నకిలీ పింఛన్లను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.
ముఖ్యంగా దివ్యాంగులు, హెల్త్ కేటగిరీకి (Health Category) మంజూరు చేయబడిన పింఛన్లలో జరిగిన అక్రమాలను పరిశీలించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ప్రక్రియలో ప్రభుత్వం వైద్య బృందాలను నియమించి, దివ్యాంగుల వైకల్యం స్థాయిని పునఃపరిశీలిస్తుంది. ఇప్పటికే గత ఆగస్టులో అర్హత లేని వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే వారికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాలు మరియు డీఆర్డీఏ సిబ్బంది ద్వారా దరఖాస్తుదారులకు సమాచారం అందించబడుతోంది.
Andhra Pradesh | ఈ రూల్ తెలుసుకోండి..
వైద్య పరీక్షల్లో 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారిని గుర్తించి, వారి పింఛన్లను రద్దు చేయనున్నారు. అయితే 60 ఏళ్లు పైబడిన అనర్హులకోసం వృద్ధాప్య పింఛన్లు (Old Age Pensions) మంజూరు చేయడం జరుగుతుంది. ఒకవేళ పరీక్షలకు హాజరు కాని వారు కూడా పింఛన్ కోల్పోతారు.రాష్ట్రంలోని పరీక్షలు బుధవారం, గురువారం, శుక్రవారంలలో నిర్వహించబడుతున్నాయి. ప్రతి కేంద్రంలో రోజుకు 100–130 మంది పింఛనుదారులు పరీక్షకు హాజరు కావాలి. పరీక్షలను నిర్వాహకులు ‘జంబ్లింగ్’ పద్ధతిలో వేరే ఆసుపత్రులలో నిర్వహిస్తున్నారు, దరఖాస్తుదారులకు ఏ రోజు ఏ ఆసుపత్రికి వెళ్లాలో ముందుగా సమాచారం అందించబడుతుంది.
మొదటి విడత పరీక్షలు అక్టోబర్ 8, 9, 10 తేదీల్లో జరిగాయి. కొన్ని జిల్లాల్లో 15 నుంచి 17 వరకు వాయిదా పడిన పరీక్షలు, దీపావళి పండుగ తర్వాత 22, 23, 24, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. అధికారుల అంచనా ప్రకారం, ఈ మొత్తం ప్రాసెస్ పూర్తి చేయడానికి సుమారు మూడు నెలలు పడుతుంది. ప్రభుత్వం ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన వారికి మాత్రమే పింఛన్లు అందేలా కట్టుబాటుగా చర్యలు తీసుకుంటుంది, పింఛన్ల అక్రమాలను అరికట్టడమే కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యంగా చెబుతున్నారు.