అక్షరటుడే, వెబ్‌డెస్క్:Metro Services | ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాల అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడింది. విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం జూలై 25, శుక్రవారం అధికారికంగా టెండర్లని ఆహ్వానించారు.
మెట్రో ప్రాజెక్టుల కోసం రాష్ట్ర మంత్రివర్గం(State Cabinet) కీలక నిర్ణయం తీసుకోగా, మొత్తం రూ.21,616 కోట్ల భారీ వ్యయంతో ఈ రెండు మెట్రో ప్రాజెక్టులను అమలు చేయాలని నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపికైన కంపెనీలకు కాంట్రాక్టులు అప్పగించనున్నారు. ఐదు సంవత్సరాల వ్యవధిలో ఈ మెట్రో ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
విజయవాడ మెట్రో రైలు (Vijayawada Metro Rail) ప్రాజెక్టు కోసం రూ.10,118 కోట్లు కేటాయించగా, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు కోసం రూ.11,498 కోట్లు కేటాయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు ప్రాజెక్టులకు 50 శాతం చొప్పున నిధుల భాగస్వామ్యం వహించనున్నాయి. రాష్ట్ర వాటాలో భాగంగా వైజాగ్ మెట్రోకు రూ.4,101 కోట్లు – VMRDA (విశాఖ మెట్రో రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ) ద్వారా సమకూర్చనుంది. విజయవాడ మెట్రోకు రూ.3,497 కోట్లు – CRDA (కాపిటల్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ) ద్వారా సమకూర్చనుంది. విజయవాడ మెట్రో మార్గం 55 కిలోమీటర్లు కాగా, PNBS (పండిట్ నెహ్రూ బస్టాండ్) – గన్నవరం ఎయిర్‌పోర్ట్, బెంజ్ సర్కిల్ – వడ్లపూడి, విజయవాడ – ఉల్లిపాయల రోడ్డు మార్గాలు నగరంలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్టాండ్లకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
విశాఖ మెట్రో మార్గం 75 కిలోమీటర్లు కాగా, వైజాగ్ మెట్రోను మూడు కారిడార్లుగా అభివృద్ధి చేయనున్నారు. గాజువాక – రుషికొండ – భీమిలి, కుర్మన్నపాలెం – పీఎంవీ బీచ్, నాడ్ జంక్షన్ – ఎయిర్‌పోర్ట్. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఏంటంటే.. స్మార్ట్ టికెటింగ్, డిజిటల్ పేమెంట్స్ లాంటి ఆధునిక సదుపాయాలు, ప్రతి స్టేషన్‌లో సీసీటీవీలు, బయోమెట్రిక్ సెక్యూరిటీ(Biometric Security), డ్రోన్ సర్వైలెన్స్(Drone Surveillance), స్టేషన్ పరిసరాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లు, షాపింగ్ మాల్‌లు, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు రియల్ ఎస్టేట్ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం. ఈ మెట్రో ప్రాజెక్టులతో (Metro Projects) ఆంధ్రప్రదేశ్ నగరాల్లో రవాణా వ్యవస్థ మరింత ఆధునికంగా మారనుంది. జనాభా పెరుగుతున్న తరుణంలో మెట్రో సేవలు సిటీ ట్రాఫిక్ తగ్గించడంతో పాటు సమయపాలనలోనూ మైలురాయిగా నిలవనున్నాయి.